కోర్టు స్టేతో ఆగిన ఇళ్ల నిర్మాణం

18 Jan, 2019 13:29 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

లబ్ధిదారులకు ఏం సమాధానం చెబుతారు

ఎమ్మెల్యే రాచమల్లు

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు : హైకోర్టు స్టే కారణంగా ప్రభుత్వం హౌసింగ్‌ఫర్‌ ఆల్‌ పథకంలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. కలెక్టర్‌తోపాటు అధికార పార్టీ నేతలెవ్వరికి ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ప్రస్తుతం లబ్ధిదారులకు ఎవరు సమాధానం చెబుతారని, డిపాజిట్‌ ఎలా తిరిగి చెల్లిస్తారని ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అపెరల్‌పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీ అధికారులు 76.17 ఎకరాల స్థలాన్ని సేకరించారు. వైఎస్‌ మరణానంతరం పరిశ్రమలను ఏర్పాటు చేయలేదన్నారు.

గత ఎన్నికల సందర్భంగా పేదలకు ఉచితంగా ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తవుతున్నా పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అపెరల్‌ పార్కుకు కేటాయించిన స్థలాన్ని హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌పథకం కింద 4150 ఇళ్లు నిర్మించేందుకు కేటాయించారన్నారు. అందులో ఉచితంగా పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ముందుగా డిపాజిట్లు సేకరించి తర్వాత బ్యాంకు రుణం ద్వారా ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. అపార్ట్‌మెంట్‌ తరహాలో నిర్మిస్తున్న ఈ ఇళ్లకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తూ పేదలను అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు. ఈ సమస్యపై తాను గతంలోనే 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టానన్నారు. కలెక్టర్‌ కేవీ రమణ హయాంలోనే తాను అపెరల్‌పార్కు స్థలంలో ఇళ్లు నిర్మించొద్దని కోరానన్నారు. అయితే జిల్లా అధికారులు మాలెపాడు గ్రామం వద్ద నిర్మించనున్న స్థలాన్ని మినహాయించి అపెరల్‌ పార్కులో ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు.

వివాదాస్పద స్థలంలో ఇళ్లు నిర్మించడం వల్లే సమస్య..
వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అపెరల్‌ పార్కు ఏర్పాటు కోసం 34 మంది రైతుల నుంచి 76.17 ఎకరాల భూమిని సేకరించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వీరిలో ప్రొద్దుటూరుకు చెందిన రైతు చిన్న వెంకటసుబ్బన్న సర్వే నంబర్‌ 679లోని 7.78 ఎకరాల భూమిపై, మల్లేల బాల పుల్లయ్య సర్వే నంబర్‌ 680లోని 3.76 ఎకరాలపై హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ ప్రకారం చిన్న వెంకటసుబ్బన్నకు గత ఏడాది నవంబర్‌ 23న, బాలపుల్లయ్యకు డిసెంబర్‌ 4న హైకోర్టు స్టే మంజూరు చేసిందని పేర్కొన్నారు. దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. అధికారులు మొత్తం 4150 మందికి ఇళ్లు నిర్మించాలని తలపెట్టగా 825 మంది డీడీలు చెల్లించి అధికారులకు ఇచ్చారన్నారు.

107 బ్లాకుల్లో ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. హైకోర్టు స్టే కారణంగా వీటిలోని 33 బ్లాకుల్లో నిర్మిస్తున్న 400 ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందన్నారు. అధికారులు సమాచారాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. ప్రస్తుతం డీడీలు చెల్లించిన వారికి అధికారులు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. భూమి ఇచ్చిన మిగతా 32 మంది రైతులు కోర్టును ఆశ్రయిస్తే హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ క్లోజ్‌ అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరం భూమి విలువ రూ.4కోట్ల నుంచి రూ.5కోట్లు పలుకుతోందన్నారు. వివాదాస్పద స్థలంలో ఇళ్లు నిర్మించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఇందుకు ప్రభుత్వంతోపాటు సంబంధిత అధికా రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. త్వరలో ఈ విషయంపై లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, కౌన్సిలర్‌ టప్పా గైబుసాహెబ్, వైఎస్సార్‌సీపీ నాయకులు కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, గోనా ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు