కౌలు రైతులకు చుక్కెదురు!

1 Sep, 2013 01:26 IST|Sakshi

నర్సీపట్నం, న్యూస్‌లైన్: కౌలు రైతుల కోసం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన భూ ఆధీకృత చట్టంతో జిల్లాలో ఒనగూరిన ప్రయోజనం శూన్యంగానే కనిపిస్తోంది. దీంతో భవిషత్తులో వీరంతా సాగునకు దూరమయ్యే ప్రమాదముంది. జిల్లాలో అడపా, దడపా కురుస్తున్న వర్షాలకు రైతులు ఖరీఫ్ సాగు సన్నాహాల్లో ఉండగా, కౌలు రైతులు మాత్రం నాగలి పట్టేందుకు వెనుకంజవేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కౌలు రైతులే సాగు చేస్తున్నా, ప్రభుత్వ రాయితీలు, రుణాలను హక్కుదారులు పొందుతున్నారు. ఫలితంగా కౌలు రైతులు నష్టపోతున్నారు. అనధికార అంచనా ప్రకారం జిల్లాలో కౌలు రైతులు 2.50 లక్షల వరకు ఉన్నారు.

భూ అధీకృత చట్టం ప్రకారం వీరందరికీ గుర్తింపుకార్డులు ఇవ్వాల్సి ఉంది. కానీ మొదటి సంవత్సరం జిల్లాలో 15,439 మందికి మాత్రమే గుర్తింపు కార్డులిచ్చారు. వీరిలో 4,971 మందికి రూ.6.30 కోట్లు రుణాలను మంజూరు చేశారు. రెండో ఏడాది సుమారుగా ఐదు వేల మంది రైతులు గుర్తింపు కార్డులు రెన్యువల్ చేసుకున్నా వారిలో 357 మందికి రూ.68.45 లక్షల రుణాలిచ్చారు. రెండేళ్లుగా జిల్లాలో ప్రతికూల వాతావరణంతో పంటలు దెబ్బతిని, కౌలు రైతులు పూర్తిగా రుణాలు చెల్లించలేకపోయారు. రుణ చెల్లింపులను పరిగణలోనికి తీసుకున్న అధికారులు కొత్తగా గుర్తింపు కార్డులిచ్చేందుకు వెనుకంజవేశారు.

దీంతో ఈ ఏడాది 2,217 మంది కౌలు రైతులకు కొత్తగా గుర్తింపుకార్డులు మంజూరు చేయగా, 1,396 మంది పాత రైతులు మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 50 మంది కౌలు రైతులకు సుమారు రూ.7 లక్షల రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ మంజూరు చేసే అన్ని పథకాలకు కౌలు రైతుల గుర్తింపుకార్డులు తప్పనిసరి. జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల మంది కౌలు రైతులు ఖరీఫ్ సాగు చేపడుతున్నా, వారిలో రెండు శాతం మందికే గుర్తింపుకార్డులు మంజూరు చేసింది. మిగిలిన 98 శాతం మంది రైతులకు గుర్తింపు కార్డులు లేక ప్రభుత్వ రాయితీలు, రుణాలకు దూరమవుతున్నారు.  
 

>
మరిన్ని వార్తలు