పద్మవ్యూహం

28 Dec, 2013 02:43 IST|Sakshi

సాక్షి, కడప : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. కడప, ప్రొద్దుటూరులాంటి ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌కు నియంత్రణే లేకుండా పోతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, రహదారుల విస్తరణ చేపట్టకపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పార్కింగ్ స్థలాలను చూపించడంలో కార్పొరేషన్, మున్సిపల్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కడపలోని  బీకేఎం, వైవీ స్ట్రీట్, ప్రొద్దుటూరులోని మెయిన్ బజారు, బంగారు అంగళ్ల వీధిలో  కనీసం నడిచి వెళ్లాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి.
 
  విద్యా సంస్థలు ఉన్నచోట జీబ్రా క్రాసింగ్‌లు లేవు. కడపలో ట్రాఫిక్ ఐలాండ్ ఉన్నప్పటికీ దిష్టిబొమ్మలా దర్శనిమిస్తోంది.   పదేళ్ల కిందట ఎంతమంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో,  జనాభా, వాహనాల సంఖ్య పెరిగినా సిబ్బంది సంఖ్య మాత్రం పెరగకపోవడం గమనార్హం. ప్రొద్దుటూరులో ఏడాదిగా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేకపోయినా పట్టించుకునేవారు లేరు. కడపలో ముఖ్యంగా అప్సర, కృష్ణా సర్కిళ్లు, ఏడురోడ్ల కూడలిలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి.
 
 బద్వేలులో ఆటోలకు సంబంధించి స్టాండు లేకపోవడంతో రోడ్లపైన నిలుపుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి మార్కెట్, నాలుగురోడ్ల కూడలిలో ట్రాఫిక్ సమస్యలు  ఉన్నాయి. మైదుకూరుకు వెళ్లే హైవే రోడ్డుపైనే ప్రతి శుక్రవారం సంత నిర్వహిస్తుండడంతో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు.
 
  పార్కింగ్ స్థలాలు చూపడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించే పోలీసుల సంఖ్య నామమాత్రంగా ఉంది.  రైల్వేకోడూరులో పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడంతో వాహనాలను హైవే రోడ్డుపైనే నిలుపుతున్నారు. కూల్‌డ్రింక్ షాపుల వారు బస్సు డ్రైవర్లకు మామూళ్లు ఇచ్చి రోడ్డుపైనే వాహనాలు నిలిపేలా చేస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలను రెండు, మూడు రోజులు నిలిపి ఉంచినా పట్టించుకునే నాథుడు లేడు.
 
  రాజంపేటలో  మార్కెట్ నుంచి పాత బస్టాండు వరకు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. కొన్ని ప్రదేశాలలో ఆటోలు, తోపుడు బండ్ల కారణంగా ద్విచక్రవాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
 
  ప్రొద్దుటూరులో  శివాలయం, రాజీవ్ సర్కిల్‌లో  ఏడాదిగా  సిగ్నల్ లైట్లు పనిచేయడం లేదు. మెయిన్ బజారు, బంగారు అంగళ్ల వీధి తదితర ప్రాంతాలు ఇరుకుగా ఉండటంతో ద్విచక్రవాహనాలు నిలిపితే ఆటోలు వెళ్లలేని పరిస్థితి. దీంతో ప్రయాణికులు నడిచి వెళుతున్నారు.  
  మైదుకూరులోని నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడంతో అన్ని వైపులా నుంచి వాహనాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్డుపైనే తోపుడుబండ్లు, వాహనాలను నిలుపుతుండటంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది.
 
  రాయచోటిలో రోడ్లు వెడల్పులేవు. వేలసంఖ్యలో ఉన్న ఆటోలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షకు పైగా జనాభా దాటినా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ లేకపోవడం గమనార్హం.
 
  కమలాపురంలో రైల్వే గేటు వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు 20కి పైగా రైళ్లు నడుస్తుండడంతో గేటు వేసినపుడు ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడుతోంది.
 
  జమ్మలమడుగులోని  పాత బస్టాండు ప్రాంతంలో ఆటోలు, తోపుడుబండ్లను రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
 

మరిన్ని వార్తలు