తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి

26 Jan, 2014 04:12 IST|Sakshi

గోదావరిఖని, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ఎడారిగా మారుతుందని సీమాంధ్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణం చేపట్టి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు. సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపడంలో భాగంగా ఆయన చేపట్టిన ఇందిరమ్మ విజయయాత్ర శనివారం ఆదిలాబాద్ జిల్లా నుంచి గోదావరిఖని వద్ద కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది.
 
 అక్కడినుంచి యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీ, పెద్దపల్లి, సుల్తానాబాద్ మీదుగా రాత్రికి కరీంనగర్ చేరుకుంది. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాతోపాటు ఆయా ప్రాంతాల్లో జరిగిన రోడ్‌షోలో హన్మంతరావు మాట్లాడారు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటాన్ని సోనియాగాంధీ గుర్తించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఆమె రుణం తీర్చుకోవాలని కోరారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంకా తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయాలనే కుట్రతో కలిసి ఉండాలని నాటకం ఆడుతున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
 
 అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరపకుండా అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కడ జన్మించాడో చూసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో పుట్టి, ఇక్కడే చదువుకున్న ఆయన ప్రభుత్వ నిధులను మాత్రం చిత్తూరుకు తరలిస్తున్నాడని, ఇదేం నీతి అని ప్రశ్నించారు. చదువుకున్న వాడని సీఎంను చేస్తే అధిష్టానాన్నే ధిక్కరిస్తూ మోసం చేస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీ పెద్దల ద్వారా ముఖ్యమంత్రి అయిన కిరణ్ నేడు ఢిల్లీ చాలా దూరం అనడం ఆయన దిగుజారుడుతనాన్ని నిదర్శనమన్నారు. నల్గొండ జిల్లా నుంచి నిజామాబాద్ వరకు పోలీసు రక్షణ కల్పించిన ప్రభుత్వం ఒక్కసారిగా ఆదిలాబాద్ జిల్లా నుంచి తగ్గించివేసిందని, ఇందులో సీఎం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కిరణ్ తెలంగాణాలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న అంబేద్కర్ ఆలోచనా విధానంతోనే నేడు తెలంగాణ కల సాకారమవుతోందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేసేలా వ్యవహరించినందుకే సీఎం తన నుంచి శాసనసభావ్యవహారాల శాఖను తప్పించాడన్నారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైందనే విషయాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. యాత్రలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, పీసీసీ ప్రధానకార్యదర్శి కోలేటి దామోదర్, ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్‌రావు, డీసీసీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతోపాటు ఆయా ప్రాంతాల్లోని నాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు