కార్మికులు కావలెను

27 Jun, 2020 03:52 IST|Sakshi

వేగం పుంజుకుంటున్న పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు

సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన వారు 3 లక్షలు

ఏపీకి తిరిగి చేరుకున్న వారు 1.80 లక్షలు

నిపుణులైన పనివారు దొరక్క సతమతం

రంగంలోకి ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 

అధిక వేతనాలు చెల్లించి వెనక్కి రప్పించేందుకు యాజమాన్యాల యత్నాలు

సమస్య పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

స్థానికులను గుర్తించి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ

గుంటూరు జిల్లా ఈపూరు మండలం బోడెపూడివారిపాలెం గ్రామానికి చెందిన దాదాపు 40 కుటుంబాలు ఏడాదిలో ఒకట్రెండు నెలలు మినహా వలసలోనే ఉంటాయి. లాక్‌డౌన్‌తో సొంత ఊరికి చేరుకున్న ఆ కుటుంబాలన్నీ కొత్త జాబ్‌ కార్డులు తీసుకుని రెండు శ్రమశక్తి సంఘాలుగా ఏర్పడి నెల రోజులుగా ఉపాధి హామీ ద్వారా పనులు పొందాయి. నగరాల్లో మళ్లీ పనులు మొదలు కావడంతో 10 కుటుంబాలు తిరిగి వలస వెళ్లిపోయాయి.

ఏపీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ వచ్చిన దాదాపు 3 లక్షల మంది ఇతర రాష్ట్రాల కార్మికులు లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లిపోయారు. మన రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసెళ్లిన దాదాపు 1.80 లక్షల మంది సొంతూళ్లకు తిరిగి వచ్చారు. ఫలితంగా ఒకవైపు పనులున్నాయి.. మరోవైపు కార్మికుల అవసరమూ ఉంది.

ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన పరిస్థితి.
అటు పరిశ్రమలకు కార్మికులను అందించడం.. ఇటు కార్మికులకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కార్మికులు, పరిశ్రమలను సమన్వయం చేసే బాధ్యతను స్వీకరించింది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా కార్యాచరణకు సిద్ధమైంది. పరిశ్రమల అవసరాలపై సర్వే చేసి అందుబాటులో ఉన్న కార్మికుల వివరాల సేకరణ ప్రక్రియను నెల రోజుల్లోగా పూర్తి చేస్తారు. అనంతరం శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ రూపొందించి అమలు చేయనున్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో కార్మికుల వివరాలు, పరిశ్రమల అవసరాలతో సమగ్ర డేటా బేస్‌ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన చిత్తూరు జిల్లా తిరుమల కండ్రిగ గ్రామానికి చెందిన ఓంశేఖర్‌ లాక్‌డౌన్‌తో ఉద్యోగం కోల్పోయారు. జీవనోపాధి కోసం ప్రస్తుతం ఊర్లోనే ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇతర రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకుంది.

సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 3 లక్షల మంది కార్మికులు లాక్‌డౌన్‌తో మన రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇవ్వడంతో రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ప్రధానంగా నగరాలు, శివారు ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా కార్మికులు అందుబాటులో లేరు. పరిశ్రమలు, తయారీ, వ్యాపార, నిర్మాణ, ఆతిథ్యం ఇలా అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిపుణులైన కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. స్థానికంగా ఉన్నవారికి అధిక వేతనాలు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో వెళ్లిపోయిన కార్మికులను వ్యయ ప్రయాసలకోర్చి మరీ వెనక్కి రప్పించేందుకు పరిశ్రమ, వ్యాపార వర్గాలు సిద్ధపడుతున్నాయి. అందుకోసం భారీగా అడ్వాన్సులు చెల్లించేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రత్యేక అనుమతులు తీసుకుని వాహనాల్లో వారిని వెనక్కి తీసుకొస్తున్నాయి.  

మామిడికి నీటి కొరత లేకుండా... 
విజయవాడ పరిసరాల్లో ఈ వేసవిలో లాక్‌డౌన్‌ సమయంలో మామిడి మొక్కలను సంరక్షించేందుకు రైతులు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. నూజివీడు, ముసునూరు, మైలవరం తదితర చోట్ల మామిడి తోటల్లో బోర్లకు మరమ్మతులు, కొత్తవి తవ్వేందుకు చత్తీస్‌గఢ్, తమిళనాడు నుంచి నిపుణులను రప్పించేందుకు ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ అడ్వాన్సులు చెల్లించారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఇన్నోవా కార్లలో రాష్ట్రానికి తెచ్చామని జి.కొండూరుకు చెందిన మదమంచి రంజిత్‌ చెప్పారు.  

రాజస్థాన్‌ నుంచి రావాల్సిందే.. 
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో  ఇప్పుడిప్పుడే వస్త్ర దుకాణాలు తెరుస్తున్నారు. డిజైనర్‌ వస్త్రాలపై ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌లు చేసే కార్మికులకు అధిక వేతనాలు చెల్లించి పనులు చేయించుకుంటారు. వీరిలో ఎక్కువమంది రాజస్థాన్‌కు చెందినవారే. వారు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఎక్కువ అడ్వాన్సులు చెల్లించి వెనక్కి రప్పిస్తున్నారు.  

మేస్త్రీలు, ప్లంబర్లకు గిరాకీ 
లాక్‌డౌన్‌తో తాపీ మేస్త్రీలు, వడ్రంగి మేస్త్రీలు, ఎలక్ట్రికల్‌ వర్కర్లు, ప్లంబర్లకు డిమాండ్‌ పెరిగింది. గతంలో వీరికి రోజుకు రూ.600 వరకూ వేతనం ఇచ్చేవారు. ఇప్పుడు స్థానికంగా ఉండే కార్మికులకు రోజుకు రూ.800 వరకూ చెల్లిస్తున్నారు.  

విద్యుత్‌ పనులకూ కూలీలే పవర్‌ 
రాష్ట్రంలో నిరంతర విద్యుత్, వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్ల సామర్థ్యం పెంపు పనులు వేగంగా సాగుతున్నాయి. కొత్త సబ్‌స్టేషన్లు, కొత్త లైన్లు నిర్మిస్తున్నారు. ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన ఈ పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంది. విద్యుత్‌ ప్రాజెక్టు పనుల్లో లాక్‌డౌన్‌ ముందు వరకు 2 వేల మంది వలస కార్మికులు పనిచేశారు. 400 కేవీ, 220 కేవీ లైన్ల నిర్మాణంలో తమిళనాడు కూలీలు నిపుణులు. దాదాపు 1,200 మంది స్వస్థలాలకు వెళ్లడంతో వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యుత్తు ప్రాజెక్టులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని కార్మికులను రప్పించడం, భద్రత కల్పించడంపై మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. 

ఆతిథ్య రంగానికి సిబ్బంది కొరత 
హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారం మందకొడిగా సాగుతుండటంతో యాజమాన్యాలు కనీస సిబ్బందితో నెట్టుకొస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఆతిథ్య రంగంలో పనిచేస్తుండగా వారిలో దాదాపు 25 వేల మంది స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇందులో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే అత్యధికంగా ఉన్నారు. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో 75 శాతం మంది వంట మనుషులు ఆ రెండు రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. ఆగస్టు తరువాతగానీ హోటల్‌ పరిశ్రమ గాడిలో పడదని యాజమాన్యాలు భావిస్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలకు చెందినవారిని వెనక్కి రప్పించడం ఆర్థిక భారమేనని పేర్కొంటున్నాయి. 

‘ఉపాధి’ డబుల్‌ 
గ్రామాల్లో వ్యవసాయ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో పట్టణాల నుంచి వెనక్కివచ్చినవారిని ఉపాధి హామీ పనులే ఆదుకుంటున్నాయి. వలస కూలీల్లో దాదాపు 40 శాతం మందికి ఉపాధి పనులే ఆధారమయ్యాయి. గత రెండు నెలల వ్యవధిలో 4.25 లక్షల మంది కొత్తగా ఉపాధి హామీ పనుల కోసం పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం.  

సమగ్ర వివరాలతో డేటా బేస్‌..
► జాయింట్‌ కలెక్టర్‌–3 ఆధ్వర్యంలోని ఈ కమిటీలో జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్, జిల్లా కార్మిక శాఖ మేనేజర్‌లతోపాటు గ్రామ/వార్డు సచివాలయంలోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సభ్యులుగా ఉంటారు.  
► ఈ కమిటీ ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలోని పరిశ్రమల అవసరాలను తెలుసుకుంటుంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రశ్నావళిని రూపొందించింది. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం ఉన్న కార్మికులు అవసరం? ప్రస్తుతం ఎంతమంది కార్మికులు కావాలి? భవిష్యత్‌లో ఆ పరిశ్రమలను విస్తరిస్తే ఎంతమంది అవసరమవుతారు? విద్యార్థులకు ఆ పరిశ్రమల్లో అప్రంటీస్‌షిప్‌ ఇస్తారా? తదితర అంశాలపై పరిశ్రమ యాజమాన్యాలను సంప్రదించి నివేదిక రూపొందిస్తారు. ఈ వివరాలతో సమగ్రంగా డేటా బేస్‌ సిద్ధం చేస్తారు. ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తారు. 

పరిశ్రమల శాఖ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌  
స్వరాష్ట్రాలకు వెళ్లిపోయిన వలస కూలీలను వెనక్కి రప్పించేందుకు పరిశ్రమల శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఏఈ)లపై ఆధారపడి 10 లక్షల మంది కార్మికులు పనిచేసేవారు. వారిలో మన రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వలస వచ్చినవారు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే అత్యధికంగా ఉన్నారు. ‘రీస్టార్ట్‌’ ద్వారా పరిశ్రమలు పునఃప్రారంభమైనా 30 శాతం నుంచి 40 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్‌ పరిశ్రమ లాంటి వాటిలో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. దాంతో 20 శాతానికి మించి గ్రానైట్‌ పరిశ్రమల్లో పనులు ప్రారంభం కాలేదు. క్వారీల్లో బండలు కోయడం లాంటి పనుల్లో రాజస్తాన్‌ కార్మికులకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. వారంతా స్వరాష్ట్రాలకు వెళ్లిపోవడంతో స్టోన్‌ క్రషింగ్‌ సిబ్బంది కోసం అడ్వాన్సులు, ప్రయాణ చార్జీలు చెల్లించి మరీ వెనక్కి రప్పిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని ‘శ్రీసిటీ’లో పని చేసే కార్మికుల్లో అత్యధికులు తమిళనాడుకు చెందినవారే. అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో స్థానిక కూలీలను వినియోగించేలా చర్యలు చేపట్టారు. 

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన శ్రీను బెంగళూరులో తాపీ పనులు చేస్తాడు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆయన కుటుంబం సొంత ఊరు చేరుకుంది. బెంగళూరులో రోజుకు రూ.700 – రూ.1,000 దాకా సంపాదించే శ్రీను ప్రస్తుతం ఇతర పనులు చేసేందుకు ఇష్టపడటం లేదు. బెంగళూరులో పనులు ప్రారంభమైతే తిరిగి  వెళ్లిపోవాలని భావిస్తున్నాడు.
 

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ వలస వెళ్లి రోడ్డు పక్కన చిన్న పాకలు వేసుకుని జీవించేవి. 2014–19మధ్య నాగార్జున సాగర్‌ కాల్వలకు నీరు విడుదల కాకపోవడంతో ఊరిలో పెద్దగా వ్యవసాయ పనులు దొరకకపోవడంతో పట్నం దారి పట్టాయి. మగాళ్లు ఆటోలు నడుపుతుండగా... ఆడవాళ్లు పని మనుషులుగా జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌తో సొంతూరికి తిరిగి వచ్చారు. నెలరోజులపాటు ఉపాధి పనులు చేసిన అనంతరం లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. సరైన శిక్షణ ఇచ్చి.. అవకాశాలు కల్పిస్తే.. ఇలాంటి వారు ఇక్కడే ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది.

ద్విముఖ వ్యూహంతో ముందుకు
అటు పరిశ్రమలు, ఇటు కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని రూపొందించింది. పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థల అవసరాలను గుర్తించడంతోపాటు అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని కార్మికులకు పనులు కల్పించేలా ప్రణాళిక సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. 

నెల రోజుల్లోగా సర్వే, వివరాల సేకరణ పూర్తి 
► సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారు ఎంతమంది ఉన్నారు? స్థానిక నిరుద్యోగులు ఎంతమంది? పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం ఉందా? అనే వివరాలను సేకరిస్తారు. 
► గ్రామాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్నవారికి అక్కడి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఉన్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  అర్హులైన వారికి స్థానిక పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.  
► పరిశ్రమల అవసరాలపై సర్వే, అందుబాటులో ఉన్న కార్మికుల వివరాల సేకరణను  నెల రోజుల్లో పూర్తి చేస్తారు. అనంతరం శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ రూపొందించి అమలు చేస్తారు.  

పరిశ్రమల అవసరాలు తీరుస్తూ కార్మికులకు ఉపాధి కల్పిస్తాం
లాక్‌డౌన్‌ పరిస్థితుల నుంచి త్వరగా కోలుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం. అటు పరిశ్రమల అవసరాలను తీర్చడంతోపాటు ఇటు మన రాష్ట్రంలోని కార్మికులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యం. అందుకోసం ప్రత్యేకంగా యాప్‌ కూడా రూపొందిస్తాం. ప్రస్తుతమే కాకుండా భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కార్మికులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం.
    – చల్లా మధుసూదన్‌రెడ్డి (ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌) 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా