మందలించారని ప్రాణాలు తీసుకొంది

10 Jul, 2014 00:54 IST|Sakshi
మందలించారని ప్రాణాలు తీసుకొంది
  • ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
  • అచ్యుతాపురం : డబ్బులంటే అంత నిర్లక్ష్యమా అని కుటుంబసభ్యులు మందలించారని మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అచ్యుతాపురం మండలంలోని తిమ్మరాజుపేటకు చెందిన శరగడం అనూష ఇటీవల ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో చేరింది.
     
    మంగళవారం ఆమె తన అక్క అశ్వని, సమీప బంధువు నాగలక్ష్మిలతో కలసి అనకాపల్లిలోని జగన్నాథస్వామి ఆలయానికి వెళ్లింది. దర్శనం తర్వాత షాపింగ్ కోసమని వారు అనూష బ్యాగ్‌లో రూ. 5 వేలు ఉంచారు. అయితే ఆలయంలో స్వామి దర్శనం తర్వాత హుండీలో డబ్బులు వేసేందుకు బ్యాగ్ తెరచిచూస్తే అందులో ఆ నగదు కనిపించలేదు. ఎక్కడో పడిపోయాయని చెప్పిన అనూషను అశ్వని, నాగలక్ష్మి మందలించారు. డబ్బులపై ఇంత నిర్లక్ష్యం ఏమిటని ఇంటికొచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా అనూషను మందలించారు.

    దీంతో అనూష ఏడుస్తూ ఇంట్లో మంచం మీద పడుకుంది. అయితే తర్వాత ఎంతసేపటికీ లేవకపోవడంతో అశ్వని ఆమెను లేపింది. అప్పటికే క్రిమిసంహారక మందు తాగిన అనూష అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో హుటాహుటిన అనూషను అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో తర్వాత విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయింది. క్షణికావేశంతో బలవన్మరణానికి పాల్పడిందంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
     

మరిన్ని వార్తలు