‘జన్ ధన్ ’తో ఆర్థిక సమానత

29 Aug, 2014 00:33 IST|Sakshi
‘జన్ ధన్ ’తో ఆర్థిక సమానత
  •      కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు
  •      జిల్లాలో పథకం ప్రారంభం
  • విశాఖపట్నం : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించుకునే దిశగాప్రధాని నరేంద్రమోడీ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని  ప్రవేశపెట్టారని జిల్లాలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు.

    జిల్లాపరిషత్‌లో గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ  దేశ తొలి ప్రధాన మంత్రి నెహ్రూ  ఆర్థిక సమానత్వాన్ని ఆకాంక్షించినా మన పాలకులంతా సుదీర్ఘ నిద్రలో మునిగిపోయారని ఆరోపించారు. ఇదే విషయమై దృష్టి సారించిన ప్రధాని మోడీ ఈ కొత్త పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఒక ఏడాది కాలంలో కోటి బ్యాంక్ ఖాతాలను ఈ పథకం కింద లక్ష్యంగా పెట్టుకోగా గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1.50 కోట్ల ఖాతాలు ప్రారంభించడం విశేషమన్నారు.

    ఈ బ్యాంక్ ఖాతాలు తీసుకున్న వారికి రూ.లక్ష మేరకు బీమా సదుపాయం, రూ.5 వేల ఓవర్‌డ్రాఫ్ట్, ఏటీఎం కార్డుల సదుపాయం ఉంటుందన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 597 బ్యాంక్ బ్రాంచీలు ఉండగా గంట వ్యవధిలో 74వేల ఖాతాలు తెరిచారన్నారు. విశాఖ ఎంపీ కె.హరిబాబు, జిల్లాకలెక్టర్ డాక్టర్  ఎన్.యువరాజ్  ప్రసంగించారు.

    ప్రభుత్వ పథకాలు అమలు చేయటంతో ఎస్‌బీఐ అగ్రగామిగా ఉందని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్  అశ్విని మెహతా అన్నారు. ఎస్బీఐ ఒక్క విశాఖ ప్రాంతంలోనే పదివేల ఖాతాలు ప్రారంభించిందని అన్నారు. ఎస్బీఐ డీజీఎంకె. నరసింహనాయక్ స్వాగతోపన్యాసం చేశారు.  అనంతరం మంత్రి అశోక్‌గజపతిరాజు ఇద్దరు ఖాతాదారులకు బ్యాంక్‌ఖాతాలు, ఏటీఎం కార్డులు అందజేశారు. జిల్లాపరిషత్  చైర్‌పర్సన్ లాలం భవానీ, నాబార్డు జీఎం కిషన్‌సింగ్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు