ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది: జేపీ

15 Oct, 2017 20:03 IST|Sakshi

సాక్షి, భీమవరం: ప్రజలు చెల్లిస్తున్న పన్నుల్లో కేంద్రం నుంచి వాటా రాబట్టుకుంటున్న రాష్ట్రాలు స్ధానిక సంస్ధలకు మాత్రం నిధులు మంజూరు చేయడం లేదని లోక్‌సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విమర్శించారు. సరైన మొత్తంలో నిధులు కేటాయించకపోవడంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ది చెందడం లేదని ఆయన అన్నారు. భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషన్‌ సొసైటీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా కేంద్రం నుంచి 51 శాతం నిధులు రాబట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, స్ధానిక సంస్ధలకు నిధుల మంజూరులో నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని దుయ్యబట్టారు.

ప్రజలకు సకాలంలో సేవలందించని అధికారులపై చర్యలు తీసుకుంటే లంచం సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. సేవలు సక్రమంగా అందకపోవడం వల్లే, లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్న వారు సుమారు 65 శాతం ఉన్నట్లు ఒక సర్వేలో తేలిందన్నారు. లంచం ఇచ్చేవారికి మూడు నుంచి ఏడేళ్లు జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త చట్టాన్ని అమలులోకి తేనున్నదని, అయితే లంచం తీసుకునే వారిపై కనీసం కేసు కూడా లేకుండా ఆ చట్టం రూపకల్పన జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో అవినీతిని తగ్గించడానికి జీఎస్‌టీ విధానం కొంతమేరకు ఉపకరిస్తుందని, అయితే ప్రజలకు అత్యవసరమైన గృహనిర్మాణ రంగంపై 28 శాతం జీఎస్‌టీ విధానం అమలు చేయడం సరికాదని అన్నారు. తాను చేపట్టిన స్వరాజ్య ఉద్యమంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నామని, ఇప్పటివరకు అయిదు జిల్లాల్లో పర్యటించినట్లు చెప్పారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి ఆరు ప్రధాన రంగాలపై దృష్టిపెట్టామని వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కృషిచేస్తున్నామని జేపీ అన్నారు.

మరిన్ని వార్తలు