కడపకు పూర్వ వైభవం తీసుకు వస్తా

8 Jun, 2015 02:37 IST|Sakshi
కడపకు పూర్వ వైభవం తీసుకు వస్తా

సాక్షి, కడప : ‘కడపలో కావలసినన్ని ఖనిజ వనరులున్నాయి. బెరైటీస్ మొదలుకొని ఆస్‌బెస్టాస్, లైమ్ స్టోన్ లాంటి వాటికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా....కడపపై నాకెలాంటి వివక్షలేదు. అన్ని జిల్లాలతో సమానంగా చూస్తా....ఇంకా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తా...పర్యాటక రంగంతోపాటు సాగునీటి వనరులను అందించి ప్రతి ఎకరాకు నీరందించేలా చర్యలు చేపడుతున్నాం.. రానున్న కాలం లో కడపకు పూర్వ వైభవం తీసుకొస్తానని’ తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆదివారం ఖాజీపేటలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆయన ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కడపనుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావడం శుభపరిణామమని..పారిశ్రామికవేత్తలు రావడానికి కూడా అవకాశం ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా జిల్లాలోని గాలివీడులో 700 మెగా వాట్ల సోలార్ ప్లాంటును 3200 ఎకరాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే తొండూరులో 26 మెగావాట్ల విండ్ పవర్ ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

 కడప నుంచే హజ్ యాత్రకు వెళ్లేలా చర్యలు
 ఇంతకమునుపు కడపకు ఉర్దూ యూనివర్సిటీ ప్రకటించా...కొన్ని పరిస్థితుల దృష్ట్యా కర్నూలులో పెట్టాల్సి వచ్చింది. అయితే కడపలో హజ్ హౌస్‌ను నిర్మించి కడప నుంచే పవిత్ర హ జ్‌యాత్రకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 గండికోటకు నీరు తీసుకొస్తాం
 ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో గండికోటకు నీరు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, అందుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొచ్చి ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ‘నేను రాత్రింబవళ్లు నిద్రపోకుండా పనిచేస్తున్నా....ప్రాజెక్టుల వద్ద నిద్రపోయా...మీరు కూడా చైతన్యవంతులు కావాలి..నీరు-చెట్టులో భాగంగా కుంటలు, చెరువులు, చెక్‌డ్యాములు అన్నిచోట్ల పూడిక తొలగించేందుకు నిధులు ఇస్తున్నాం, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 అన్నమయ్య ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తాం
 కడపలో ఉన్న ఎయిర్‌పోర్టు పురాతన చరిత్ర కలిగింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీషు వారు యుద్ధ విమానాలకు ఇంధనం నింపుకోవడానికి వినియోగించడంతోపాటు తర్వాత కూడా అప్పుడప్పుడూ వినియోగించేవారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం కడప ఎయిర్‌పోర్టును ప్రారంభించామని ముఖ్యమంత్రి తెలిపారు. వెంకటేశ్వరస్వామిపై ఎన్నో కీర్తనలు రచించిన అన్నమయ్య ఎయిర్‌పోర్టుగా నామకరణం చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు ప్రారంభోత్సవాలు చేశారు.

 బాబు మాట్లాడుతుండగా.....ఇంటిదారి పట్టిన మహిళలు
 తమ్ముళ్లూ కొద్దిసేపు కూర్చోండి...గంటసేపు కూడా ఓపిగ్గా కూర్చోలేకపోతే నేను ఎలా 24 గంటలు ఎలా కష్టపడాలి...కూర్చోండి తమ్మళ్లూ అంటూ బాబు ప్రసంగంలో విజ్ఞప్తి చేస్తుంటే...మరోవైపు డ్వాక్రా మహిళలు ఇంటిదారి పట్టారు. దీంతో ఏంచేయాలో తోచని కొంత మం ది ‘దేశం’ నేతలు, పోలీసులు కాసేపు కూర్చోండమ్మా అంటూ మహిళలను ప్రాధేయపడ్డారు. అయినా చాలామంది మహిళలు లేచి వెళ్లిపోవడంతో బాబు ప్రసంగ సమయంలో చాలావరకు కుర్చీ లు ఖాళీగా దర్శనమిచ్చాయి.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి, మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కేవీ రమణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, దేశం జిల్లా నేతలు లింగారెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, గోవర్దన్‌రెడ్డి, అమీర్‌బాబు, గునిపాటి రామయ్య, వరదరాజులురెడ్డి, విజయమ్మ. విజయజ్యోతి, కస్తూరి విశ్వనాథనాయుడు, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, కుసుమకుమారి, దుర్గాప్రసాద్, బి.రాంగోపాల్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు