చరిత్రను తిరగరాసిన తొలి వితంతు వివాహం

11 Dec, 2019 09:58 IST|Sakshi
కందుకూరి జన్మగృహంలో ఏర్పాటు చేసిన తొలి వితంతు వివాహం జ్ఞాపకాలు

బాల్య వితంతువు నుదిట కల్యాణ తిలకం దిద్దినరోజు

చరిత్రను తిరగరాసిన తొలి వితంతు వివాహం

ఉద్రిక్త పరిస్థితుల్లో 1881 డిసెంబర్‌ 11న

సంస్కరించిన యుగపురుషుడు కందుకూరి

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం కల్చరల్‌: వివాహమంటే బొమ్మలాట అనుకునే ప్రాయంలో, ముక్కుపచ్చలారని బాలికను కాసులమీద ఆశతో చావడానికి సిద్ధంగా ఉన్న పండుముదుసలికి ఇచ్చి వివాహం చేయడం సంప్రదాయంగా చెలామణీ అవుతున్న రోజులవి. తెలిసీ తెలియని ప్రాయంలో వితంతువుగా మారిన చిన్నారుల మనోవ్యధలను కన్న తల్లితండ్రులే పట్టించుకోని రోజుల్లో.. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలకు సమాజాన్ని సిద్ధం చేస్తున్న రోజులు.. ఎదురైన ప్రతిఘటనలకు అంతే లేదు. అన్నిటినీ ఎదిరించి, తాను నమ్మిన సంస్కరణోద్యమాన్ని విజయపథాన చేర్చగలిగారు కనుకనే ఆయన యుగపురుషుడయ్యారు.

కుహనా వేదాంతుల ఇష్టారాజ్యం
‘ప్రారబ్ధం చాలకపోతే, ప్రతివాళ్లకి వస్తుందది (వైధవ్యం). చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా రాసినరాత యెవడైనా తప్పించగలడా?.. వైధవ్యం అనుభవించినవాళ్లంతా పూర్వం యెంత ప్రతిష్ఠ బతికారు కాదు?’ నాటి పెద్దమనుషుల మనస్తత్వాలకు అద్దంపట్టే అగ్నిహోత్రావధానులు పాత్ర ద్వారా మహాకవి గురజాడ అప్పారావు పలికించిన ‘సుభాషితాలు’. నాటి సమాజంలో అగ్నిహోత్రావధానులు లాంటి వారికి కొదవ లేదు.

చాటుమాటు వ్యభిచారం చేసినా ఫరవాలేదు, పునర్వివాహం మాట వద్దు...

 కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్రలో చెప్పిన ఒక సంఘటన..జ్యోతిష శాస్త్రం వృత్తిగా చేసుకుని జీవనం, జీవితం సాగిస్తున్న ఒక పెద్దమనిషి చెల్లెలు వితంతువు అయింది. సరే అన్నగారు వితంతువులు కట్టుకునే అంచులేని ముతకబట్టలను తీసుకువచ్చి, సోదరిని ధరించమన్నాడు. ఆమె ససేమిరా అంది. నేను పునర్వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. సోదరుడు అయినవారి దగ్గిర తన సోదరిని గురించి వాపోయాడు. సోదరుని ‘హితైభిలాషులు’వచ్చి, ఆ చిన్నారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. చాటుమాటు వ్యభిచారం చేసుకున్నా ఫరవాలేదు కానీ, మారు మనువు తలపెట్టవద్దని హెచ్చరించారు. వారు సూచించిన మార్గంలోనే ఆమె జీవనయానం సాగించింది.  (కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్రము గ్రంథము– పునర్ముద్రణ 2015.పుటలు 135,136)వితంతు వివాహాలు శాస్త్రసమ్మతమే అనేక గ్రంథాలను పరిశీలించి, కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలకు శాస్త్ర నిషేధం లేదని నిరూపించారు. విశాఖపట్టణం నుంచి మహామహోపాధ్యాయ పరవస్తు వేంకట రంగాచార్యులు స్త్రీపునర్వివాహం శాస్త్రసమ్మతమని ఒక చిన్న పుస్తకం ప్రకటించారు. కొక్కొండ వేంకట రత్నం పంతులు ఈ వాదనను ఖండించడానికి ప్రయత్నాలు చేశారు. కొందరు ఛాందసవాదులు కందుకూరిపై భౌతికదాడులకు సైతం వెనుకాడలేదు.

1881 డిసెంబర్‌ 11వ తేదీన తొలి వితంతు వివాహం
కృష్ణా మండలం తిరువూరు డిప్యూటీ తహసీల్దారు దర్భా బ్రహ్మానందం నుంచి కందుకూరి ఒక లేఖను అందుకున్నారు. తిరువూరు ప్రాంతం, రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే 12 సంవత్సరాల బాల వితంతువు ఉన్నదని, గౌరమ్మకు మారు మనువు చేయడానికి ఆమె తల్లి సుముఖంగా ఉన్నదన్నది లేఖ సారాంశం. విశాఖపట్టణంలో పోలీస్‌ శాఖలో ఉద్యోగం చేస్తున్న గోగులపాటి శ్రీరాములు భార్యను కోల్పోయారు. ఆయనకు కందుకూరిపై గౌరవం, భక్తి ఉన్నాయి. వితంతువును వివాహమాడటానికి ఆయన అంగీకరించారు. ఈ వార్త నగరమంతా పొక్కి, పెద్ద దుమారం లేచింది. వంటమనిషి రావడం మానేసింది. ఇంటి పురోహితుడూ అంతే.. బంధువులు వీరేశలింగాన్ని ఆడిపోసుకున్నారు. ‘ఇంకేముంది? అంతా నాశనమే’ అంటూ శాపనార్థాలు పెట్టారు. తీవ్రమైన ఉద్రిక్త వాతావరణంలో కందుకూరి ఇంట డిసెంబర్‌ 11వ తేదీ రాత్రి చరిత్రాత్మకమైన తొలి వితంతు వివాహం జరిగింది. నాడు పోలీసులు, విద్యార్థులు కందుకూరికి బాసటగా నిలబడ్డారు.. ‘మహాసంక్షోభంలో వివాహం జరిగిందని కందుకూరి స్వీయచరిత్రలో పేర్కొన్నారు. ఆ తరువాత కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో జరిగిన సుమారు 39 వితంతు వివాహాల వివరాలు లభ్యమవుతున్నాయి. వంకాయలవారి వీధిలోని కందుకూరి జన్మగృహంలో డిసెంబర్‌ 11వ తేదీ రాత్రి జరిగిన పునర్వివాహాన్ని స్మరిస్తూ, విగ్రహాలను నెలకొల్పారు.

నేడు కందుకూరిసంస్కరణోద్యమంపై సెమినార్‌
బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఎస్‌కేవీటీ కళాశాలలో కందుకూరి సంస్కరణో ద్యమం–వితంతు వివాహాలు’ అంశంపై సెమినార్‌ జరగనుంది.

సంస్కరణోద్యమాన్నిముందుకు తీసుకువెళ్లాలి
స్త్రీ సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు. అత్యాచారాలు, హత్యాచారాలు మహిళలపై కొనసాగుతూనే ఉన్నాయి. నేటి విద్యార్థి లోకం, మేధావులు ఈ సమస్య పరిష్కారానికి కందుకూరి స్ఫూర్తితో కృషి చేయాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మన లక్ష్యం కావాలి. నాడు సామాజిక దురాచారాలకు, నేడు అత్యాచారాలకు బాధితురాలు స్త్రీమూర్తి కావడం సభ్యసమాజానికి సిగ్గుచేటు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా