గప్‌చుప్‌గా ఆల్మట్టి ‘ఎత్తు’లు

2 May, 2019 03:31 IST|Sakshi

ఆల్మట్టి ఎత్తు పెంపులో కర్ణాటక దూకుడు.. ఇక మనకు మిగిలేది మట్టే!

బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పును కేంద్రం నోటిఫై చేయకపోయినా ముందుకెళ్తున్న కర్ణాటక

రూ.30,143 కోట్లతో గ్రీన్‌ సిగ్నల్‌..

భూసేకరణ, పునరావాస పనులు ప్రారంభం

అదనంగా 130 టీఎంసీలతో 5.62 లక్షల హెక్టార్లకు నీరిచ్చేలా ప్రణాళిక

ఎత్తు పెంచితే సెప్టెంబరు ఆఖరుకు కృష్ణా వరద

తెలుగు రాష్ట్రాల్లో తాగునీటికీ ఇబ్బందులు తప్పవు

వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నోరు మెదపని సీఎం చంద్రబాబు

కనీసం కేంద్ర జల సంఘానికి కూడా ఫిర్యాదు చేయని రాష్ట్ర ప్రభుత్వం

చుక్క నీరు కూడా దిగువకు రాకుండా కృష్ణమ్మను ఒడిసి పట్టుకునేందుకు కర్ణాటక తహతహలాడుతుంటే రాష్ట్ర సర్కారు చోద్యం చూస్తోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130 టీఎంసీలను అదనంగా దండుకునేందుకు ‘ఆల్మట్టి’ ఎత్తు పెంచుతుంటే  నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎత్తిపోతల పథకాలతో ‘కృష్ణ’ను దారి మళ్లిస్తున్నా గుడ్లప్పగించింది. పాలక పెద్దల స్వార్థం రైతాంగానికి శాపంగా మారనుంది. ఇంకా ఇలాగే ఉపేక్షిస్తే రాష్ట్రంలో సాగు నీటిపై అన్నదాతలు ఆశలొదులుకోవాల్సిందే.

సాక్షి, అమరావతి : ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే పనులను కర్ణాటక ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయడానికి సిద్ధమైంది. తద్వారా అదనంగా 130 టీఎంసీలను వినియోగించుకుని 5,62,032 హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.30,143 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 30,875 హెక్టార్ల భూమిని ఒక వైపు సేకరిస్తూనే, మరో వైపు 22 ముంపు గ్రామాలకు చెందిన 23,561 కుటుంబాల ప్రజలకు పునరావాసం కల్పించే పనులను ప్రారంభించింది. డ్యామ్‌ ఎత్తు పెంచే పనులను గ్లోబల్‌ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించడంపై దృష్టి సారించింది.

ఈ పనులు పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం పరిధిలోని రైతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును కేంద్రం ‘నోటిఫై’ చేయక ముందే.. కర్ణాటక సర్కార్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఆమోదం తెలిపింది. కానీ ఈ తీర్పును అమలు పరుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య కాకుండా నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.

డీపీఆర్‌ తయారీకి 2014లోనే టెండర్లు
కేంద్రం నోటిఫై చేయకపోయినా, సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచే పనులు చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి 2014 డిసెంబర్‌లోనే కర్ణాటక సర్కారు టెండర్లు పిలిచి, తక్కువ ధరకు కోట్‌ చేసిన వ్యాప్కోస్‌కు అప్పగించింది. ఈ విషయమై అధ్యయనం చేసిన వ్యాప్కోస్‌.. 524.256 మీటర్లకు ఎత్తు పెంచితే 30,875 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని, 22 గ్రామాలకు చెందిన 23,561 మంది నిర్వాసితులుగా మారతారని తేల్చింది. అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు (యూకేపీ) మూడో దశలో భాగంగా 8 ఎత్తిపోతల పథకాలు చేపట్టి, ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల అందుబాటులోకి వచ్చే 130 టీఎంసీలను వినియోగించుకుని 5,62,032 హెక్టార్లకు నీళ్లందించవచ్చని నివేదించింది. ఇందుకు రూ.30,143 కోట్ల వ్యయం అవుతుందని చెప్పింది. ఈ నివేదికను 2016లోనే ఆమోదించిన కర్ణాటక సర్కార్‌ ఇప్పుడు భూసేకరణ, పునరావాస పనులను ప్రారంభించింది. డ్యామ్‌ ఎత్తు పెంచే పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది.

రెండు నెలలు ఆలస్యంగా కృష్ణమ్మ 
ఆల్మట్టి ఎత్తు పెంచి, నారాయణపూర్‌ జలాశయం ఎడమ కాలువకు అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు చేపట్టడం ద్వారా అదనంగా కనీసం 223 టీఎంసీలను వినియోగించుకోవడానికి కర్ణాటక సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది. కేవలం ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల ఆ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీల నుంచి 210.89 టీఎంసీలకు పెరుగుతుంది. ప్రస్తుతం ఆగస్టు నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూరాల, శ్రీశైలం జలాశయాలకు చేరడం లేదు. ఆల్మట్టి ఎత్తు పెంచే పనులు పూర్తయినా, నారాయణపూర్‌ జలాశయానికి అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు పూర్తయినా.. ఎగువ నుంచి జూరాల, శ్రీశైలానికి చేరే వరద ప్రవాహంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. సెప్టెంబరు ఆఖరు నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం చేరే అవకాశం ఉండదు. అప్పుడు సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవు.

కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారే 
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉంది. ఇందులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌.. 299 టీఎంసీలు తెలంగాణకు తాత్కాలికంగా కేటాయించారు. ఐదేళ్లుగా వర్షాభావం వల్ల కృష్ణా నదిలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. కేటాయింపుల మేరకు నీటి లభ్యత లేకపోవడం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిలో నీటి లభ్యత కనిష్ట స్థాయికి పడిపోతుంది. అప్పుడు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సర్కార్‌ ఇంత చేస్తున్నా సీఎం చంద్రబాబు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నోరు మెదపడం లేదంటున్నారు. కనీసం కర్ణాటక చర్యలపై కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు కూడా చేయకపోవడాన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కర్ణాటకకు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది. 

మరిన్ని వార్తలు