నట్టేట ముంచారు

21 Jun, 2014 02:46 IST|Sakshi
నట్టేట ముంచారు

మొక్కజొన్న రైతుకు  కుచ్చుటోపీ
పండిన పంటను తీసుకెళ్లి  ఎగనామం

 
 చక్రాయపేట:మొక్కజొన్న సాగు చేస్తే ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు.. దగ్గరుండి పంటను చూసుకుంటామన్నారు.. పండిన కంకులను తామే కొంటామన్నారు.. దిగుబడి రాకపోతే చేతి నుంచి డబ్బు చెల్లిస్తామన్నారు.. ఇలా రైతులకు ఎన్నో ఆశలు రేపిన కావేరీ విత్తన కంపెనీ  కుచ్చుటోపీ పెట్టింది. రైతులను నిలువునా ముంచేసి కంపెనీ ప్రతినిధులు ఉడాయించారు. దీంతో తీవ్రంగా నష్టపోయిన మొక్కజొన్న రైతులు పోలీసులను ఆశ్రయించనున్నారు.

 మొక్కజొన్న సాగుచేస్తే ఖర్చులన్నీ తామే భరిస్తామని..పండిన కంకులను పచ్చివే టన్ను రూ. 11వేలతో కొంటామని దిగుబడి రాకుంటే చేతి నుంచి చెల్లిస్తామని రైతులను  నమ్మించి మండల వ్యాప్తంగా సుమారు వంద ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయించారు. ఎంత చేసినా  దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.ఎకరాకు నాలుగైదు టన్నులు కాదుకదా నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి రాలేదు. అంతేగాక  10 రోజుల్లో డబ్బు చెల్లిస్తామని చెప్పి  వచ్చిన దిగుబడిని కూడా లారీల్లో తీసుకెళ్లి చేతులెత్తేశారు. మరికొందరు రైతులు కంకులను వలిపించి విత్తనాలను సంచుల్లో నింపి ఇళ్లల్లోనే ఉంచుకున్నారు. తమను నిలువునా  మోసం చేసిన కావేరి విత్తన కంపెనీ వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులను ఆశ్రయించనున్నారు.

నమ్మకం కుదిరేందుకు..

 రైతులకు నమ్మకం కలిగించేందుకు  కావేరీ విత్తన కంపెనీ ఆర్గనైజర్ పోరుమామిళ్ల మండలం చెన్నారెడ్డిపేటకు చెందిన గురివిరెడ్డి,ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన రమణారెడ్డి (సబ్‌ఆర్గనైజర్) మండలంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు.నిత్యం రైతుల పొలాల వద్దకు  వెళ్లి పంటలను పర్యవేక్షిస్తూ వచ్చారు. వారి సూచనల మేరకు రైతులు రసాయన, సేంద్రీయ ఎరువులు వాడారు. క్రమం తప్పకుండా నీటి తడులు అందించారు.  ఇలా రైతుల చేత ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చు  చేయించారు.  పంట కోశాక పచ్చి కంకులే కొంటామన్న కంపెనీ ప్రతినిధులు 15 రోజులపాటు ఎండనిచ్చి తూకాలు వేయడంతో ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇదేమిటని  నిలదీయడంతో సరకు తూకం వేయండి.. డబ్బు ఇస్తామని  చెప్పి ఉడాయించారని రైతులు వాపోతున్నారు. తాము తీవ్రంగా నష్టపోవడమే కాకుండా అప్పుల పాలు కావాల్సివచ్చిందని ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు