ఖరీఫ్ కష్టమే..

7 Aug, 2013 03:38 IST|Sakshi

డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: వరుణుడు కరుణించినా ఖరీఫ్ సాగంటేనే రైతన్నలు బెంబేలెత్తిపోతున్నారు. ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోవంతో సాగుకోసం పెట్టుబడులను భరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయన్న ఆనందం రైతుల్లో లేకుండా పోయింది. పెరిగిన రేట్లతో పెట్టుబడులు ఈసారి 20 శాతం వరకు రైతులపై అదనపు భారం  కానున్నాయని వ్యవసాయాధికారులే పేర్కొంటున్నా రు. రెండేళ్లలో సుమారు 14 సార్లు ఎరువుల ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూక్ష్మ పోషక విధానం(ఎన్‌బీఎస్) కారణమని అధికారులు అంటున్నారు. ఎరువుల ధరలు పెంచే అధికారం కం పెనీలకు ఇవ్వడంతో అవి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతన్న నడ్డి విరుస్తున్నాయి. సకాలంలో ఎరువు లు, విత్తనాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటిం చినా ఆచరణలోకి రావడం లేదు. దీంతో విత్తనాల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి భారీ వర్షాలతో చెరువులు,కుంటలు జలకళను సంతరించుకున్నా యి. భూగర్భజలాలు సైతం పెరిగాయి.  
 
 జిల్లాలో ఈసారి ఖరీఫ్‌లో 4 లక్షల 70వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో  లక్షా 20వేల హెక్టార్లలో వరి, 60వేల హెక్టార్లలో మొక్కజొన్న,  లక్షా 90 వేల హెక్టార్లలో సోయా, లక్ష హెక్టార్లలో ఇతర పంటలు సాగు కానుండగా, ఇందుకు సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాకు 1లక్షా 20వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 62వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా  జిల్లాలోని పలు ప్రాం తాల్లో రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఆందోళనలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సోయా విత్తనాలు పంపిణీ చేయాల్సి వచ్చింది. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో డీఏపీ బస్తా ధర రూ. 985 ఉండగా ప్రస్తుతం రూ. 1107కు చేరుకుంది. పొటాష్ బస్తా ధర రూ. 410 ఉండగా ప్రస్తుతం రూ. 810కి  పెరిగింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా బస్తాకు రూ. 150 నుంచి రూ. 200 వరకు పెరిగాయి. సబ్సిడీపై ప్రభుత్వం అందజేసే సోయాబీన్ విత్తన ధరలు సైతం బాగా పెరిగాయి. సోయా విత్తన సబ్సిడీని రైతుల ఖాతాల్లో  ప్రభుత్వం ఇంతవరకు జమచేయలేకపోయింది.
 
 పెరిగిన కూలి రేట్లు..
 గత ఖరీఫ్‌తో పోల్చుకుంటే ఈ యేడాది కూలి రేట్లు బాగా పెరిగాయి. గతేడాది ఒక్కో మహిళా కూలీకి రోజుకు రూ.200 చెల్లించగా, ప్రస్తుతం రూ. 320 చెల్లించాల్సి వస్తోంది. అలాగే ట్రాక్టర్‌తో దున్నడానికి గతేడాది ఎకరానికి రూ. 500 ఉం డ గా, ఈ యేడు రూ. 600 కు పెరిగింది. నాట్లు వేసే  ముందు కేజ్‌వీల్ ట్రాక్టర్‌తో దమ్ము చేసేందుకు గతేడాది రూ. 800 చెల్లించగా, ఈ యేడు రూ. 950 చెల్లించాల్సి వస్తుంది.

మరిన్ని వార్తలు