కత్తి పక్కన పెట్టారు

16 Jun, 2018 09:00 IST|Sakshi
శ్రీశైల దేవస్థానంలో పనిచేస్తున్న క్షురకులు ధర్నా చేస్తున్న దృశ్యం   

శ్రీశైలం క్షేత్రంలో క్షురకుల నిరసన

ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ 

తలనీలాలు సమర్పించేందుకు భక్తుల ఇబ్బందులు

సాక్షి, శ్రీశైలం టెంపుల్‌ : శ్రీశైలం దేవస్థాంనంలో క్షురకులు శుక్రవారం విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో పాతాళగంగ దారిలో ఉన్న కేశఖండనశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళ్యాణ కట్ట సంఘం అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్ర దేవాలయాల కేశఖండనశాల జేఏసీ పిలుపు మేరకు  ధర్నా చేశామన్నారు. ఈనెల 1న విజయవాడకు చెందిన ఓలేటి రాఘవులు కేశఖండన చేసిన అనంతరం ఓ భక్తుడి నుంచి రూ.10 తీసుకున్నందుకు ధర్మకర్తల మండలి సభ్యుడు పెంచలయ్య దుర్భాషలాడుతూ దాడి చేయడానికి నిరసనగా విధులు బహిష్కరించామన్నారు.

అలాగే తమకు నెలకు రూ.15వేలు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని కోరగా పరిష్కరిస్తామని చెప్పిన విజయవాడ ధర్మకర్త మండలి అధ్యక్షుడు గౌరంగ బాబు, ఎంఎల్‌సీ బుద్దా వెంకన్న నెరవేర్చకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈనెల 14వ తేదీ వరకు గడువు ఇచ్చినా పాలకుల్లో చలనం లేకపోవడంతో కత్తి పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. శ్రీశైల దేవస్థానాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. క్షేత్రంలో పనిచేసే క్షురకులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే క్షురకుల సంక్షేమ నిధి నుంచి సహాయం చేస్తామని అధికారులు చెప్పినా అమలు కావడం లేదని వాపోయారు. కళ్యాణకట్టలో పనిచేసే చెన్నయ్యకు కొన్ని రోజుల క్రితం కాలు విరిగిపోయినా నేటి వరకు సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు