పట్టాలెక్కని సౌకర్యాలు 

19 Jun, 2019 08:31 IST|Sakshi
రైల్వేస్టేషన్‌లో చెట్టుకింద సేద తీరుతున్న ప్రయాణికులు

సాక్షి, మహానంది(కర్నూలు) : నంద్యాల – గుంటూరు రైలు మార్గంలో గాజులపల్లె రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు వసతులు కరువయ్యాయి. రైలు వచ్చే వరకు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. ఈ రైల్వేస్టేషన్‌కు సమీపంలో కేవలం 4 కి.మీ. దూరంలో మహానంది పుణ్యక్షేత్రం ఉండడంతో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటుంది. రోజుకు సుమారు 2 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.  ఇక్కడ రైల్వే శాఖ అధికారులు రిజర్వేషన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి వెళ్లేందుకు సమీప గ్రామాల వారు అధిక సంఖ్యలో ఈ స్టేషన్‌ మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. గాజులపల్లె స్టేషన్‌ నుంచి చలమ, పచ్చర్ల, కృష్ణంశెట్టిపల్లె, గిద్దలూరు తదితర స్టేషన్ల మీదుగా విజయవాడకు వెళ్లేందుకు సమీప గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు మహానంది పుణ్యక్షేత్రం దగ్గరగా ఉండడంతో అటు విజయవాడ నుంచి, ఇటు గుంతకల్లు వైపు నుంచి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. కాని ప్రయాణికులు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గతంలో డీఆర్‌ఎంగా ఆనంద్‌మాథూర్‌ విధులు నిర్వహించే సమయంలో సుమారు రూ.16 లక్షలతో షెడ్లు, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కాని అవి నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో భక్తులు, ప్రయాణికులు మండుటెండల్లోనే రైళ్లకోసం వేచి చూడాల్సి వస్తోంది.   

మహానంది స్టేషన్‌గా పేరు మార్పు ఎప్పుడు?
గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు మహానంది స్టేషన్‌గా పేరు మార్చాలని, దీని ద్వారా మహానంది పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని అధికారులు కొన్నేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.  తాజాగా మహానంది దేవస్థానం ఈఓ సుబ్రమణ్యం, వేదపండితులు రవిశంకర అవధాని, అధికారులు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని కలిసి గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు మహానంది స్టేషన్‌గా మార్పు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ ఈ విషయాన్ని పార్లమెంట్‌ సమావేశంలో చర్చించడంతో పాటు రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారని దేవస్థానం అధికారులకు తెలిపారు. ఈ సారైనా ఎంపీ చొరవతో మహానంది ఫుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా పేరు వస్తుందని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు