మరో 4 రోజులు సెగలే..

19 Jun, 2019 08:27 IST|Sakshi

సీజన్‌ మారినా తగ్గని ఎండలు

ఈ నెల 23న నైరుతి పలకరింపు...  

ఎండిన    బోర్లు    గార్డెనింగ్‌కూ నీటి కొరత..

సాక్షి,సిటీబ్యూరో: సీజన్‌ మారినా..ప్రచండ భానుడి తీవ్రత తగ్గకపోవడంతో గ్రేటర్‌ సిటీజన్లు విలవిల్లాడుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేఅవకాశాలు లేవని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సముద్రం నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమైనట్లు తెలిపింది. కాగా మంగళవారం నగరంలో గరిష్టంగా 37.7 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెల 22(శనివారం)వరకు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయి లో నమోదవుతాయనిప్రకటించింది. ఈనెల 23 (ఆదివారం)నుంచి తెలంగాణ ప్రాంతాన్ని నైరుతి పలకరించి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

జూన్‌లోనూ రికార్డు ఎండలు..నీటికొరత
గతంలో ఎన్నడూ లేనిరీతిలో గ్రేటర్‌ పరిధిలో జూన్‌ నెలలోనూ మండుటెండలు నగరవాసులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. మే నెలలో 42 డిగ్రీలకు పైగా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు..జూన్‌ మూడోవారం సైతం 38–40 డిగ్రీల మేర నమోదవుతుండడంతో సిటీజనులు సొమ్మసిల్లుతున్నారు. ఇంటి ఆవరణ, పెరట్లో నూతనంగా మొక్కలు పెంపకం, గార్డెనింగ్‌ ప్రారంభిద్దామనుకున్నవారు సైతం మండుటెండలు, వర్షాల లేమి కారణంగా ఈ పనులు వాయిదావేయడం గమనార్హం. ఇప్పటికే గ్రేటర్‌ సిటీలో సుమారు 22 లక్షల బోరుబావులకుగాను..సుమారు 50 శాతం బోరుబావులు చుక్కనీరు లేక బావురుమంటున్నాయి. దీంతో ఇళ్లలో గార్డెనింగ్‌ అవసరాలకు సైతం నీటికొరత తీవ్రంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలమండలి సరఫరా చేస్తున్న నల్లానీరు ఏమూలకూ సరిపోకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్‌ నీళ్లను ఆశ్రయించి వినియోగదారులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రతి ఐదువేల లీటర్ల ట్యాంకర్‌ నీళ్లకు ప్రాంతం, డిమాండ్‌ను బట్టి ప్రైవేట్‌ ట్యాంకర్‌ యజమానులు రూ.1000–1500 వరకు వసూలు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ..భూగర్భజలాల కోసం వెయ్యి అడుగుల లోతువరకు బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూయంత్రాంగం చోద్యం చూస్తోంది.  

మరిన్ని వార్తలు