బరి తెగించిన భూ బకాసురులు

9 Nov, 2018 12:28 IST|Sakshi
షెడ్డును కూల్చేస్తున్న రైతులు

రాజధానిలో కొనసాగుతున్న కబ్జాల పర్వం

రూ.220 కోట్లు విలువ చేసే లంక భూముల కబ్జాకు భారీ స్కెచ్‌

స్థానిక రైతుల్లో కొంతమందిని లోబర్చుకుని గేమ్‌

పది రోజుల కిందట భూముల్లో షెడ్డుల నిర్మాణం

ఆగ్రహంతో కూల్చేసిన రైతులు

తుళ్లూరు: రాజధానిలో వాలిన భూ రాబందులు బతికి ఉండగానే బడుగు రైతుల్ని పీక్కుతింటున్నాయి. పాపం పుణ్యం ఆలోచించడం లేదు. బినామీ పేర్లతో ఇప్పటికే స్థలాల్ని మింగిన భూ బకాసురులు అవి సరిపోక అసైన్డ్, లంక భూముల్ని కాజేయడానికి భారీ స్కెచ్‌ వేశారు. రాజధానిని ప్రకటించి సమీకరణ నాటకాలు మొదలుపెట్టడానికి మునుపే అసైన్డ్, లంక భూములపై కన్నేశారు. పరిహారం ఇవ్వకుండానే లాక్కుంటారన్న ప్రచారాలతో పాటు సామ,దాన,భేద,దండోపాయాలెన్నో ప్రయోగించారు.. తాజాగా అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఎంపీ రాజుగారు మనుషులమంటూ రాజధాని గ్రామమైన తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామ లంకల్లో 110 ఎకరాలను కాజేయడానికి కుట్ర పన్నారు. దీనికి ‘ఆపరేషన్‌ పందుల దిబ్బ : 110 ఎకరాలు’ అంటూ భారీ స్కెచ్‌ వేసినట్టు బాధిత రైతులు చెబుతున్నారు. వారిలో కొంతమందిని లోబర్చుకునిఈ ఆపరేషన్‌కు ఎరగా వాడుకుంటుండటం గమనార్హం.

1981 నుంచి లీజు చెల్లింపు
వెంకటపాలెం లంక పరిధిలో ఉన్న భూముల్ని సాగు చేసుకోవడానికి గ్రామంలోని 96 కుటుంబాలకు చెందిన వారంతా 1981లో వెంకటపాలెం కోఆపరేటివ్‌ జాయింట్‌ ఫార్మింగ్‌ అనే సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. దీని పరిధిలో 121 ఎకరాలు ఒక దిబ్బ, 110 ఎకరాలు (పందుల దిబ్బ) మరో దిబ్బ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ఇరిగేషన్‌ శాఖకు 121 ఎకరాలకు చెందిన భూములకే లీజు చెల్లిస్తూ వస్తున్నారు. దీంతో 110 ఎకరాలను మరో వ్యక్తికి ఆ శాఖ అధికారులు లీజుకు ఇచ్చారు. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత 2013 నుంచి లీజు తీసుకోవడానికి ఇరిగేషన్‌ అధికారులు  నిరాకరించారు. బాధిత రైతులు రెండు దిబ్బలు తమ సొసైటీ పరిధిలోనే ఉన్నాయి కదా.. ఎక్కడకీ పోవు అనే నమ్మకంతో వాళ్ల పని చేసుకుంటున్నారు.

ఆపరేషన్‌ పందులదిబ్బకు ఎసరు
ఇంతలో టీడీపీ నేతలు, బడా బాబులు కళ్లు ఈ భూములపై పడ్డాయి. లంక భూముల్ని దోచుకోని వాటిని రిసార్ట్‌లుగా మార్చేసి కోట్లు కొల్లగొట్టాలనేది వీరి వ్యూహంగా కనిపిస్తోంది. బాధిత రైతుల్లో కొంతమందిని లోబర్చుకుని వారికి పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పి మంతనాలు చేయిస్తున్నారు. సొసైటీ పేరు మీద ల్యాండ్‌ పూలింగ్‌కు ఇస్తే ఎకరాకు 500 గజాలు ఇస్తామని నమ్మించారు.

ఇందులో 250 గజాలు రైతులు తీసుకుంటే, మిగతా 250 గజాలు తాము తీసుకుంటామంటూ ప్రలోభ పెట్టారు. దీనికి ఒప్పుకోని పక్షంలో అసలు భూములు దక్కకుండా చేస్తామని బెదిరించారు. దీంతో రైతులంతా కలసి ఈ కథను నడుపుతున్న వ్యక్తిని నిలదీశారు. దీంతో అతడు ఏకంగా పావులుగా వాడుకుంటున్న రైతుల్ని వాడుకుని ఆ భూముల్లో షెడ్లు వేసి పాగా వేసే ప్రయత్నం చేశాడు. బుధవారం ఉదయం రైతులంతా కలసి లంక భూముల్లోకి వెళ్లి షెడ్లను కూల్చేశారు. ఇంతలో కబ్జాదారులు లోబర్చుకున్న రైతుల్లో ఒకడు వచ్చి దబాయించాడు. అయినా మిగతా వారు పట్టించుకోకుండా షెడ్లను నేలమట్టం చేశారు.

మరిన్ని వార్తలు