నోటీసులపై  న్యాయ పోరాటం

20 May, 2019 15:14 IST|Sakshi

పాలకవర్గంతో డీసీసీబీ చైర్మన్‌ ధనుంజయరెడ్డి సమావేశం

నోటీసుల జారీ చట్టవిరుద్ధం అని వ్యాఖ్య

సాక్షి , నెల్లూరు: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో నిధులు దుర్వినియోగం అయ్యాయని వాటిపై వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ ముత్యాలరాజు జారీ చేసిన నోటీసులు రాజకీయ దుమారం రేపాయి. వీటిపై కోర్టులో న్యాయపోరాటం చేయాలని పాలకమండలి నిర్ణయించింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) చైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి నివాసంలో పాలకమండలి సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ క్రమంలో నోటీసులు జారీవెనుక జరుగుతున్న పరిణామాలు, దీని వెనుక ఉన్న సహకార శాఖ అధికారుల పాత్ర చర్చించారు. అనంతరం అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై న్యాయపోరాటం ద్వారానే దీనిని తేల్చుకోవాలని నిర్ణయించి న్యాయవాదితో చర్చలు జరిపారు.

నోటీసులకు తిరిగి వివరణ ఇవ్వడంతో పాటు కోర్టులో దీనిని సవాలు చేయాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి విరాళం ఇవ్వడం. అలాగే బ్యాంక్‌ శత జయంతి వేడుకులను అట్టహాసంగా నిర్వహించడం కూడా నిధుల దుర్వినియోగంలో భాగం అయ్యాయని నోటీసుల్లో సారాంశం. ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేసినవే. అవి కూడా పాలకమండలి తీర్మానంతో పాటు సబ్‌ కమిటీ అనుమతితో చేసిన కార్యక్రమాలు ఇప్పుడు డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న మెట్టుకూరు ధనుంజయరెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడడంతో నోటీసులు జారీ చేసి వేధింపుల పర్వం మొదలుపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. 

పార్టీ మారగానే నోటీసుల హడావుడి
ఇదిలా ఉంటే మెట్టుకూరు ధనుంజయరెడ్డికి నోటీసులు జారీ చేయడం అటు రాజకీయ వర్గాలతో పాటు సహకారశాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారడంతో అధికారులపై అధికారపార్టీ నేతలు ఒత్తిడి తీసుకురావడంతో వారికి ఒక అధికారి సహకారం తోడైంది. దీంతో హడావుడిగా బ్యాంక్‌ అధికారులను 14,15 తేదీలు పిలిచి మాట్లాడి అప్పటికప్పుడు వారితో నివేదికలు సిద్ధం చేసి 16వ తేదీతో నోటీసులు జారీ చేశారు. గతంలో సహకార శాఖలో పనిచేసిన ఒక మహిళా అధికారి డైరెక్షన్‌తోనే ఈ తతంగం అంతా నడిచినట్లు తెలుస్తుంది. సదరు మహిళా అధికారి గతంలో బ్యాంక్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈమెపై కొన్ని ఆరోపణలు రావడంతో ఆమెను తప్పించారు. ఈ క్రమంలో అప్పట్లో ఆమె అధికారులను తప్పుదోవ పట్టించేలా నివేదికలు ఇచ్చిందని దానిలో భాగంగానే తాజాగా జారీ అయిన నోటీసులు అని పాలకవర్గ సభ్యులు మండిపడుతున్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పిలుపుతోనే రాజధాని నిర్మాణానికి 2014లో రూ.6 లక్షలు విరాళం బ్యాంక్‌ ప్రకటించారు. దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకటించిన విరాళం ఇది. అది కూడా బ్యాంక్‌ పాలకవర్గం అనుమతితో జరిగిన విషయం. అలాగే సీఎంను ఆహ్వానించిన శతజయంతి వేడుకలకు రూ.35 లక్షలు ఖర్చు చేశారు. దీనికి కలెక్టర్‌ కూడా హాజరయ్యారు. అలాగే బ్యాంక్‌ కాంప్లెక్స్‌లోని షాపుల అద్దెలు బాగా తక్కువగా ఉండటం,  పాలక మండలి తీర్మానంతో బిడ్‌లు ఆహ్వానించి షాపులను కేటాయించారు. ఈ క్రమంలో అద్దెలు తగ్గించడం వల్ల, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని వల్ల రూ.42.30 లక్షలు నష్టం వాటిల్లిందని దీనిని దుర్వినియోగంగా చూపారు. ఈ మూడు అంశాలపై ఈ నెల 25న పాలకవర్గం తరుపున న్యాయవాది హాజరుకావాలని పాలకమండలి నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు