పెళ్లి చేసుకుంటానని మోసం

27 Jun, 2019 11:51 IST|Sakshi
బాధిత మహిళతో మాట్లాడుతున్న ఎస్సై

సాక్షి, మల్యాల(చొప్పదండి) : ప్రేమించానని వెంటపడి.. కన్నవారికి.. కడుపున పుట్టిన వారికి దూరమై.. ప్రేమించిన వాడి సరసన చేరిన మహిళ రోడ్డున పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ.. ఇంట్లో సమస్యలు పరిష్కారం కాగానే ఇంటికి తీసుకెళ్తానంటూ పన్నెండేళ్లుగా సహజీవనం చేశాడు. ప్రియురాలితో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ.. మరో మహిళ మెడలో తాళి కట్టిన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. 

మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ అదే గ్రామానికి చెందిన మ్యాకల అనిల్‌తో పన్నెండేళ్ల క్రితం స్నేహం కుదిరింది. అప్పటికే మహిళకు వివాహమై, ముగ్గురు పిల్లలున్నారు. నిన్ను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానంటూ అనిల్‌ నమ్మబలికాడు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం వ్యవహారం మహిళ భర్తకు తెలియడంతో పలుమార్లు పంచాయతీ కాగా, చివరికి వీరిద్దరి వివాహేతర సంబంధం కారణంతోనే విడాకులు తీసుకుని, భర్త దగ్గరనే పిల్లలను వదిలిపెట్టి అనిల్‌ చెంతకు చేరింది.

పన్నెండేళ్లుగా సహజీవనం
పెళ్లిచేసుకుంటానంటూ నమ్మిస్తూ.. పన్నెండేళ్లుగా సంసారం చేస్తున్నాడు. మా చెల్లి భర్త చనిపోతే కూడా వెళ్తానన్నా వెళ్లనివ్వలేదు. బయట ప్రపంచంతో సంబంధం ఉండకూదడని, ఎవరితో మాట్లాడవద్దంటూ హింసించాడు. వివిధ ప్రాంతాల్లో అద్దెకు ఉంచుతూ, ఇంట్లో సమస్యలు తీరిపోగానే ఇంటికి తీసుకెళ్తానంటూ నమ్మించాడు. చివరికి చెల్లి పెళ్లి అయిన తర్వాత అంటూ ఏ రోజుకారోజు ఏదో ఒక సమస్య చెబుతూ దాట వేశాడు. అన్ని సమస్యలు తీరిపోగానే పన్నెండేళ్లు సంసారం చేసిన విషయం మరిచి, మరో మహిళను మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈనెల 25న కూడా ఫోన్‌లో మాట్లాడాడు. నా పుట్టింటికి దూరమై..అందరికి నన్ను దూరం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేసి, మరో మహిళను వివాహం చేసుకున్నాడని మహిళ బోరున విలపించింది.

పోలీస్‌స్టేషన్‌కు చేరిన బాధిత మహిళ
తక్కళ్లపల్లిలో నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఇంటి ఎదుట బుధవారం మహిళ బైఠాయించింది. సమాచారం మేరకు ఎస్సై ఉపేంద్రచారి అక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. తనను అనిల్‌ ఏవిధంగా వంచించాడో వివరించింది. తనకు న్యాయం చేసేదాకా ఇక్కడి నుండి కదలనని, పోలీస్‌స్టేషన్‌కు వస్తే అనిల్‌ తన ధనబలంతో న్యాయం జరగదంటూ తేల్చి చెప్పింది. దీంతో అక్కడినుంచే ఎస్సై ఉపేంద్రచారి అనిల్‌తో ఫోన్‌లో మాట్లాడి, పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా హుకుం జారీ చేశారు. చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని, ఎవరి పైరవీలకు లొంగమంటూ మహిళకు నచ్చజెప్పడంతో పోలీసులతోపాటు బాధిత మహిళ మల్యాల పోలీసు స్టేషన్‌కు చేరింది.

మరిన్ని వార్తలు