సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి

12 Dec, 2018 13:26 IST|Sakshi
రోధిస్తున్న భార్య, కుమార్తె సెల్‌ టవర్‌పైన వెంకటేశ్వరరావు

సోదరుడితో ఆస్తి వివాదాలే కారణం

పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణ

న్యాయం చేయకపోతే దూకేస్తానని బెదిరింపులు

పోలీసుల రంగప్రవేశంతో కథ సుఖాంతం

కృష్ణాజిల్లా, పెనమలూరు : కానూరు గ్రామంలో ఓ వ్యక్తి సెల్‌ టవర్‌ ఎక్కి హడావిడి చేశాడు. తన సోదరుడు ఆస్తి విషయంలో మోసం చేశాడని, పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఈ పని చేశాడు. దీంతో పోలీసులు, గ్రామస్తులు వచ్చి అతనిని శతవిధాలా నచ్చజెప్పి కిందకు రప్పించారు. వివరాలిలా ఉన్నాయి. కానూరుకు చెందిన గుడివాక వెంకటేశ్వరరావు (48) ఆటోనగర్‌లో ఇనుప సామాను కొట్టులో పని చేస్తున్నాడు. అతనికి సోదరుడు రాంబాబుతో ఆస్తి వివాదం ఉంది. వీరికి ఆటోనగర్‌లో 500 గజాల స్థలం ఉంది. రాంబాబు 250 గజాలు అమ్ముకున్నాడు. మిగతా 250 గజాల స్థలం వెంకటేశ్వరరావుకు అగ్రిమెంట్‌ రాశాడు. ఆ స్థలాన్ని వెంకటేశ్వరరావు 2015 సంవత్సరంలో అమ్ముకున్నాడు. అయితే, తన సంతకం పోర్జరీ చేసి స్థలాన్ని అమ్మాడంటూ రాంబాబు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంకటేశ్వరరావుపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ ఆస్తి వ్యవహారం సోదరుల మధ్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు మంగళవారం ఉదయం గ్రామంలోని రంగా బొమ్మ వద్ద ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కి తనకు న్యాయం చేయాలని పట్టుబట్టాడు. లేకపోతే పై నుంచి దూకుతానని బెదిరించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు..
సమాచారం అందుకున్న సీఐ దామోదర్, సిబ్బంది రంగంలోకి దిగారు. గ్రామ మాజీ సర్పంచి అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి కూడా వచ్చి సెల్‌ టవర్‌పై ఉన్న వెంకటేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడారు. రాంబాబును పిలిపించి, రాజీ చేస్తామని టవర్‌ దిగాలని కోరారు. దాదాపు గంట పాటు టవర్‌పై హడావిడి చేసిన వెంకటేశ్వరరావు చివరికి రాజీకి ఒప్పుకుని కిందకి దిగి వచ్చాడు. దీంతో పోలీసులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులు వేధించటం వలనే..
పోలీసులు తరచూ తన ఇంటికి వచ్చి కేసు విషయంలో వేధించటం వలన సెల్‌ టవర్‌ ఎక్కానని వెంకటేశ్వరరావు చెప్పాడు. పోలీసులు తరచూ వచ్చి సమన్లు ఇస్తామని ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు. తనను సోదరుడు మో సం చేయటమే కాకుండా పోలీసు కేసు పెట్టడం అన్యాయమని వాపోయాడు. ఈ వ్యవహారం పటమట పోలీస్‌ స్టేషన్‌లో మాట్లాడుకోవాలని అతనికి నచ్చజెప్పి అక్కడకు పంపించారు. బాధితుడికి భార్య వీరరాఘవమ్మ, మౌనిక, మోహనసాయి అనే పిల్లలు ఉన్నారు. 

మరిన్ని వార్తలు