కట్నం కోసం చిత్రహింసలు

21 Jan, 2014 01:35 IST|Sakshi
సాక్షి, కాకినాడ/కాజులూరు, న్యూస్‌లైన్ :ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ తర్వాత కట్నం కోసం వేధించడమే కాక, దాడి చేసి గాయపర్చడంతో ఆరు నెలలుగా కట్టా లక్ష్మి అనే అభాగ్యురాలు ఆస్పత్రి పాలై రోదిస్తోంది. ఆదుకునే ఆసరా లేక ఆమె సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ను కలసి తన గోడు వినిపించింది. ఆరు మాసాల క్రితం కాళ్లు చచ్చుబడిపోయి, వైద్యానికి స్థోమత లేక అగచాట్లు పడుతున్నానని, తన వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను కోరింది. దుర్గాసోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమె వైద్యపరీక్షలకు రూ.10వేలు అందజేయాలని తాను కోరగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు సోముప్రసాద్ అంగీకరించినట్టు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. 
 
 కాగా బాధితురాలికి హైదరాబాద్ నిమ్స్‌లో మెరుగైన వైద్యసహాయానికి కలెక్టర్ సిఫారసు చేశారు.ఈ సందర్భంగా బాధితురాలు ‘న్యూస్‌లైన్’కు తెలిపిన వివరాలు.. తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన కట్టా లక్ష్మి కాకినాడలోని ఓ టైలరింగ్ షాపులో పనిచేసేది. కాజులూరు మండలం పాతమంజేరుకి చెందిన కారు డ్రైవర్ మురముళ్ల దాసుతో ఆమెకు పరిచయం ప్రేమగా మారింది. దాసు తల్లితండ్రులు నాగేశ్వరరావు, రాణి అంగీకారంతో 2010 మే 23న వారు పెళ్లి చేసుకున్నారు. ఏడాది తరువాత  కట్నం కావాలంటూ అత్తమామలు, ఆడపడుచు కలసి లక్ష్మిని వేధించడం ప్రారంభించారు. భర్త దాసు కూడా తాగి వచ్చి శారీరక, మానసిక వేధింపులకు గురిచేసేవాడు. 
 
 కట్నం తీసుకురాకపోతే తమ కొడుక్కి వేరే పెళ్లి చేస్తామని ఆరు నెలల క్రితం అత్తమామలు బెదిరించారని, అదే సమయంలో భర్త తనపై కర్రతో దాడి చేసి మోకాలిపై విచక్షణారహితంగా కొట్టి గెంటివేశాడంది. దీనిపై గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశానంది. భర్త కొట్టిన దెబ్బలకు కాళ్లు చచ్చుబడిపోవడంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. దీనిపై గొల్లపాలెం ఎస్సై పి.క్రాంతికుమార్‌ను వివరణ కోరగా ఆరు నెలల క్రితం కుటుంబ తగాదా విషయమై బాధితురాలు వచ్చిందని, అయితే పెద్దల సమక్షంలో వివాదం సర్దుబాటు చేసుకున్నారని తెలిపారు. మరోమారు ఆమె పోలీస్‌స్టేషన్‌కు వస్తే కాకినాడ మహిళా పోలీసు విభాగంలో ఫిర్యాదు చేయాలని సూచించామన్నారు. గొల్లపాలెం పరిధిలోని కుటుంబ తగాదాలను కాకినాడ మహిళా పోలీసు విభాగమే పరిష్కరిస్తుందన్నారు.
 
>
మరిన్ని వార్తలు