‘వాటి కొరత లేదు అందోళన పడకండి’

18 Mar, 2020 10:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌-19 వైరస్‌ నియంత్రణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ.. నిరంతరం సమీక్షిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ బుధవారం బులెటిన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో కోవిడ్ -19 పాజిటివ్‌ బాధితుడు కోలుకుంటున్నాడని, 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్‌ చేస్తామని వెల్లడించారు. 
కరోనా అలర్ట్‌: మరొకరికి వ్యాధి నిర్ధారణ

కాగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యలో సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని, అవాస్తవాల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మాస్కులు, శానిటైజర్ల  కొరత లేదని, దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని లేదా వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని చెప్పారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలని, ఈ వైరస్‌ ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 856 మంది  ప్రయాణికుల్ని గుర్తించామన్నారు. వారిలో 586 మంది ఇళ్లలోనే  వైద్యల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  మిగిలిన 250 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని, 20 మంది ఆసుపత్రిలో  వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.

14 రోజులు ఇంట్లోనే ఉండండి

ఇక 102 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా 90 మందికి నెగటివ్ వచ్చిందని చెప్పారు. మరో 11 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.  కోవిడ్‌-19 ప్రభావిత దేశాల  నుండి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా 14రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లకూడదన్నారు. అంతేగాక కుటుంబ సభ్యులను కానీ, ఇతరులను కానీ కలవకూడదని, 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. కొవిడ్-19ను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అంటు వ్యాధుల చట్టం-1897లోని 2,3,4 సెక్షన్లను అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఏదైనా ప్రాంతానికి రాకపోకల్ని నియంత్రించే అధికారం జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.  

>
మరిన్ని వార్తలు