పా‘మాయ’లు సాగనివ్వం

6 Jun, 2018 08:18 IST|Sakshi
ఆయిల్‌పామ్‌ తోట

బొబ్బిలి కోట ముందే తేల్చుకుంటాం
మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు తన భూములను రక్షించుకునేందుకు, తన అనుచరులకు పనికి రాని భూములకు ఎక్కువ ధర వచ్చేలా సర్కారుకు అంటగట్టేందుకే మంత్రి పదవి సంపాదించుకున్నారు. శిష్టు సీతారాంపురంలో ఎస్సీలకు ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా పంపిణీ చేసేందుకు ఎకరా కనీసం రూ.6లక్షలు కూడా చెయ్యని భూములను అధికారులతో రూ.14 లక్షలకు కొనుగోలు చేయించిన ఘనత మంత్రిది. కొనుగోలు చేసిన భూముల్లో ఎకరాకు రూ.2 నుంచి రూ.3లక్షల వరకు మంత్రి కమీషన్లు దండుకుంటున్నారు. ఈ భూదందా, దోపిడీలపై బొబ్బిలి కోట ముందే సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తాం. ప్రజాక్షేత్రంలోనే దీనిపై తేల్చుకుంటాం.
– బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు

సాక్షి ప్రతినిధి, విజయనగరం/టాస్క్‌ఫోర్స్‌ : రామభద్రపురం మండలం శిష్టు సీతారాంపురం సిత్రాలు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి. తెరవెనుక జరిగిన బాగోతంపై వరుసగా వస్తున్న కథనాలు నేతల్లో కదలిక తీసుకువచ్చాయి. అధికారవర్గాల్లో వణుకు పుట్టించాయి. తప్పు చేసిన వారు నోరెత్తడానికే భయపడి బయటకు రావడం లేదు. పెద్దలకు అండగా వ్యవహారాన్నంతా నడిపించిన జిల్లా అధికారుల్లో ఒకరు జ్వరం వచ్చిందంటూ విధులకు సెలవు పెట్టేస్తే... మరికొందరు తప్పును కప్పిపుచ్చుకునే యత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి అనుచరులు రంగంలోకి దిగి అధికారులను, ప్రజలను భయపెట్టడం మొదలుపెట్టారు. సాక్షికి ఎలాంటి సమాచారం అందించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. సాక్షికి ఎవరైనా వాస్తవాలు వెల్లడిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదంటూ విపక్షాలు వారికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చాయి.

అధికారపార్టీ నాయకులే కారకులు
తక్కువధర భూములు అధికధరలకు కొనుగోలు చేసిన స్కాంలో అధికారపార్టీ నాయకులే కీలకం. మంత్రి అనుచరులు చేసిన ఈ స్కాంలో మంత్రి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై విచారణ చేసి సూత్రధారులపై చర్యలు చేపట్టి ఎస్సీలకు న్యాయం చేయాలి. బా«ధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలి.         – ఒమ్మి రమణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, బొబ్బిలి 

అధికారులు, పాలకులు కుమ్మక్కయ్యారు
ఎస్‌.సీతారాంపురం భూ పంపిణీ పథకంతో అధికారులు, ప్రభుత్వం కలసి దళితులను ఇరుకున పెడుతున్నాయి. వాళ్ళ నెత్తిన రుణాల భారాన్ని రుద్దుతున్నాయి. దళితుల సంక్షేమాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం దళితులను అనేక చిక్కుల్లో, ఇబ్బందుల్లో పెడుతోంది. ఇప్పటికీ పేదరికంలో   మగ్గుతున్న వారిని మరింత  అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి.      – పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి

దళితులను దగా చేస్తున్నారు
టీడీపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక జిల్లాలో అనేక చోట్ల అనేక రకాలుగా దళితులపై దాడులు పెరిగాయి. భూ పంపిణీ పథకంలో దళితులను ఇరుకున పెట్టి వాళ్ళకు తెలియకుండానే అప్పుల పాలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను సీపీఎం చూస్తూ ఊరుకోదు. సీతారాంపురం దళితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. బొబ్బిలి రాజులు అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్ని లాక్కుంటున్నారు.          – తమ్మినేని సూర్యనారాయణ,  సీపీఎం జిల్లా కార్యదర్శి.

సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్ధారించిన ధరే
రామభద్రపురం మండలం శిష్టు సీతారాంపురంలో పేదలకు పంపిణీ చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్ధారించిన మార్కెట్‌ ధర ప్రకారం కొనుగోలు చేశాం. చుట్టుపక్కల ధరలను కమిటీ పరిశీలించి అందుకు అనుగుణంగా ధర నిర్ణయించింది. సాధారణ భూములు రూ.13 లక్షల వరకు ధర పలుకుతుంది. శిష్టు సీతారాంపురంలో ఆయిల్‌పామ్‌ తోటలు పెంచి డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసి, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో వాటికి అయిన ఖర్చును కలుపుకొని అందుకు అనుగుణంగా ధరను నిర్ణయించాం. రెండునెలల క్రితమే ఈ ప్రక్రియ పూర్తిచేశాం. కమిటీలో ఎస్సీ కార్పొరేషన్, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, ఉద్యానవనశాఖ, రెవెన్యూశాఖ అధికారులు ఉన్నారు.                                  – బి.సుదర్శనదొర, ఆర్డీఓ, పార్వతీపురం 

కఠిన చర్యలు చేపట్టాలి
వరుసగా పత్రికలో కథనాలు వస్తున్నా అటు అధికారులు కానీ, ఇటు అధికారపార్టీకానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. శిష్టు సీతారాంపురంలో ఎకరా రూ.7లేదా రూ.8లక్షలు ఉంటుంది. అలాంటిది రూ.14లక్షలు ఎలా అంచనా వేసి కొనుగోలు చేశారు? దీనిలో ఎవరి పాత్ర ఎంత ఉందో దర్యాప్తు చేయాలి. బాధ్యులపై చర్యలు చేపట్టాలి.         – రెడ్డివేణు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు, బొబ్బిలి

ఇదేనా నీతివంతమైన పాలన?
మంత్రి నీతివంతమైన పాలన ఇదేనా? గతంలో పేద ఎస్టీలకు ఇచ్చిన భూములు లాక్కున్నారు. ప్రస్తుతం ఎస్సీలకు పనికిరాని ఆయిల్‌పామ్‌ తోటను కమీషన్లకోసం బలవంతంగా అంటగట్టి పెద్ద స్కాంకు తెరతీశారు. పాత్రధారులు ఎవరైనా వారిపై చర్యలు చేపట్టాలి. పేదలకు న్యాయం చేయాలి. ఎవరూ నోరుమెదపకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సమాధానం చెప్పాలి.
– ఆకుల దామోదరరావు, లోక్‌సత్తా రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, బొబ్బిలి.

>
మరిన్ని వార్తలు