మంత్రి అవతారమెత్తిన సోమిరెడ్డి తనయుడు

16 Jul, 2017 04:54 IST|Sakshi
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(ఫైల్‌)
- నిబంధనలకు మంగళం
మంత్రి హోదాలో ఎత్తిపోతల పథకానికి పూజలు
 
పొదలకూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం నేతలు చెలరేగిపోతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనయుడు రాజగోపాల్‌రెడ్డి ఏకంగా మంత్రి అవతారమెత్తారు. నిబంధనలను పట్టించుకోకుండా, అధికారిక హోదా ఏమీ లేకపోయినా శనివారం ఎత్తిపోతల పథకం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొదలకూరులో కండలేరు ఎడమ గట్టు కాలువపై రూ.60 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇటీవల రెండుసార్లు తెలుగుగంగ ఇంజనీరింగ్‌ అధికారులు ట్రయిల్‌ రన్‌ వేశారు. పైపుల మధ్య నీరు లీకవడంతో మరమ్మతులు పూర్తి చేయించారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తుది ట్రయల్‌ రన్‌ కార్యక్రమం నిర్వహించి ఎత్తిపోతల పథకానికి సాగునీటిని అధికారికంగా విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు.

అయితే మంత్రికి బదులుగా ఆయన కుమారుడు రాజగో పాల్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై కాలువ తూము వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని కూడా విడుదల చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా తన కుమారుడే ఉంటారని ఇటీవల ప్రకటించిన మంత్రి సోమిరెడ్డి శనివారం పార్టీ శ్రేణులను రాజగోపాల్‌రెడ్డి వెంట పంపించి నీటి విడుదల కార్యక్రమం జరిపించారు. ప్రోటోకాల్‌ వివాదం రాజుకుంటుందని భావించిన ఇంజనీర్లు,  అధికారులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. పార్టీ శ్రేణులే అన్నీ తామై మంత్రి కుమారుడితో ఎత్తిపోతల నుంచి నీరు విడుదల చేయించడంతో ఇది పార్టీ కార్యక్రమమో, ప్రభుత్వ కార్యక్రమమో తెలియక రైతులు తలలు పట్టుకున్నారు.
మరిన్ని వార్తలు