నన్ను ఈడ్చేశారు.. ఫోను లాక్కున్నారు: ఎమ్మార్వో

8 Jul, 2015 18:35 IST|Sakshi
నన్ను ఈడ్చేశారు.. ఫోను లాక్కున్నారు: ఎమ్మార్వో

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, తనను ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షి తెలిపారు. తన ఫోను కూడా లాక్కుని విసిరేశారన్నారు. దాడి ఘటన అనంతరం ఆమె 'సాక్షి టీవీ'తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన ఫోనును ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బందే లాగేసుకున్నారని ఆమె చెప్పారు. తనను కొట్టి 25 ట్రాక్టర్ల ఇసుక అక్కడి నుంచి తీసుకెళ్లారన్నారు. జరిగిన ఘటనపై తాను కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, వాళ్లు అంతా వస్తున్నారని ఆమె తెలిపారు. ప్రభుత్వ డ్యూటీమీద వచ్చిన తమపై ఇలా దౌర్జన్యం చేయకూడదని.. ఆయనకు నిజంగా పర్మిట్లు ఉంటే, సర్వే చేసేవరకు ఆగి చెప్పాలి గానీ, తమను కొట్టి ట్రాక్టర్లు తీసుకెళ్లడం సరికాదని అన్నారు.

విషయం తెలిసిన తర్వాత అక్కడకు ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారని.. అయితే ఎమ్మెల్యే అనుచరులు 50 మందికి పైగా ఉండటంతో వీళ్లు ఏమీ చేయలేకపోయారని ఎమ్మార్వో వనజాక్షి వివరించారు. జరిగిన దాడిని తమ ఉద్యోగుల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లానని, వాళ్లు కూడా దీంట్లో కలగజేసుకుంటున్నారని తెలిపారు. ఇలా దాడులు చేస్తే ఇక విధులు ఎలా నిర్వహిస్తామని ప్రశ్నించారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటునే ఇలా చేస్తే వీఆర్వో, ఆర్ఐ లాంటివాళ్లకు తగిన అధికారాలు కూడా ఉండవని.. వాళ్లు ఏమీ చేయలేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ దృష్టికి కూడా ఈ దాడి విషయాన్ని తీసుకెళ్లానని, ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పారని అన్నారు.

మరిన్ని వార్తలు