బలపడుతున్న అల్పపీడనం

2 Jul, 2019 03:57 IST|Sakshi

నేడు వాయుగుండంగా మారే అవకాశం

మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

ఒడిశా, బెంగాల్‌ను ముంచెత్తనున్న భారీ వర్షం

సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం క్రమ క్రమంగా బలపడుతోంది. సోమవారం నాటికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ నైరుతి వైపునకు వంగి ఉంది. ఫలితంగా ఈ తీవ్ర అల్పపీడనం మరింతగా బలపడి మంగళవారం వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు బలహీనంగా ఉన్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. వాయుగుండం మన రాష్ట్రంపై అంతగా ప్రభావం చూపకుండా పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించే అవకాశం ఉండడంతో ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

తూర్పు గోదావరిలో భారీ వర్షం
గడచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. చింతూరులో 8, కుకునూరులో 4, వరరామచంద్రపురం, వేలేరుపాడు, కూనవరం, వెలిగండ్లల్లో 3, బెస్తవారిపేట, టెక్కలి, అర్థవీడు, పగిడ్యాల, కర్నూలు, ఆత్మకూరు, నందికొట్కూరు, శ్రీశైలంలో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు