రెండు రోజుల్లో ఉల్లిధరలు అదుపులోకి..

1 Oct, 2019 14:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: విజిలెన్స్‌ దాడులు చేయించి ఉల్లి బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించామని మార్కెటింగ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. దీని ద్వారా ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉల్లి సరఫరా పరిస్థితిపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉల్లిపాయల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు బజార్లలో రూ.25కే కిలో ఉల్లి సరఫరా చేయాలని సూచించారు. ఉల్లి అక్రమ రవాణాను నివారించాలని, ఉల్లిని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉల్లి ఎంత ధరకైనా కొని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు ఇప్పటివరకు 665 మెట్రిక్‌ టన్నుల ఉల్లి కొనుగోలు చేశామని వెల్లడించారు. ప్రజల కోసం అధిక ధరకు ఉల్లి కొని ధరల స్థిరీకరణ నిధి ద్వారా ధరలు తగ్గించామని స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఉల్లి ధరలు పూర్తిగా అదుపులోకి వస్తాయన్నారు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని తెప్పిస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు