కదులుతున్న ‘నకిలీ’ల డొంక

30 Sep, 2014 01:41 IST|Sakshi
కదులుతున్న ‘నకిలీ’ల డొంక
  • వెలుగుచూస్తున్న మరిన్ని విషయాలు
  •  యూనివర్సిటీ సర్టిఫికెట్లు   సైతం తయారీ
  •  పెరుగుతున్న నిందితుల సంఖ్య
  •  ఒక్క దివిసీమలోనే 600 ఆటోలకు నకిలీ బీమా !
  • గుడివాడ అర్బన్/ చల్లపల్లి : నకిలీ సర్టిఫికెట్ల కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది.  రెండు రోజులుగా టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్న 9మంది నిందితులు వెల్లడిస్తున్న వాస్తవాలు  తీవ్ర సంచలనానికి దారి తీస్తున్నాయి.  దీంతో మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్సూరెన్స్, ఆధార్, రేషన్, ఓటరు కార్డులే కాకుండా యూనివర్సిటీస్థాయి ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ పట్టాలను సైతం నకిలీవి సృష్టించి ఇస్తున్నట్లు విచారణలో  గణేష్ అనే నిందితుడు  బయటపెట్టాడు.

    దీంతో పోలీసులు ఈ తరహా సర్టిఫికెట్లను తయారు చేసే వారిని, వీరి వద్ద నుంచి సర్టి ఫికెట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను  సేకరిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో నకిలీ సర్టిఫికెట్లు పొంది ఉన్నతోద్యోగాల్లో ఉన్న వారందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
     
    వెలుగు చూసిందిలా....

    ఇటీవల గుడివాడ  సివిల్ కోర్టుకు చెందిన ఓ ఉన్నతాధికారి భర్త ద్విచక్ర వాహనం బీమా రెన్యూవల్  చేయించమని కారు డ్రైవర్‌కు ఇచ్చారు. కారు డ్రైవర్ నకిలీ పత్రాలు సృష్టించే గణేష్‌ను ఆశ్రయించాడు. అతను ఇన్సూరెన్స్ పత్రాన్ని అందించాడు. ఇన్సూరెన్స్ పత్రం తీసుకున్న తరువాత కూడా కంపెనీ నుంచి యజమానికి ఫోన్ రావడంతో నెట్‌లో ఇన్సూరెన్స్‌ను చెక్ చేశాడు. ఇన్సూరెన్స్ రె న్యూవల్ చేయించలేదని తేలడంతో  కారు డ్రైవర్‌ని నిలదీశాడు.  గణేష్ అనే యువకుడు రెన్యూవల్ చేసి ఇచ్చాడని చెప్పాడు. దీంతో  విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వలపన్ని శనివారం రాత్రి గణేష్‌ను పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుల అదుపులో ఉన్నవారిని ప్రశ్నించడంతో 17ప్రైవేటు కంపెనీలకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.  
     
    ఏ సర్టిఫికెట్‌నైనా సృష్టిస్తాడు..

    ఏ సర్టిఫికెట్లనైనా సునాయాసంగా  సృష్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి గణేష్ అని పోలీసుల విచారణలో బయటపడింది. ఇన్సూరెన్స్, ఆధార్, రేషన్, ఓటరుకార్డులతో పాటు  ఆచార్య నాగార్జున, అంబేద్కర్, ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి అమ్ముతున్నాడు. రూ.2000నుంచి రూ.3000 తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం.
     
    అదుపులో 15మంది నిందితులు..


    ఆదివారం అదుపులోకి తీసుకున్న 9మంది  నుంచి  మరింత సమాచారాన్ని సేకరించారు.  ఈ తరహా సర్టిఫికెట్లను ఏ నెట్ సెంటర్ నిర్వాహకులు  తయారుచేస్తారని అడగడంతో మరో ఆరుగురు పేర్లను చెప్పారు. దీంతో ఆ ఆరుగురిని పోలీసులు ఆదివారం రాత్రి స్టేషన్‌కు తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఈ కేసులో మరో 20మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.  
     
    గుడివాడలో 35శాతం అక్రమ ఆధార్‌లే..


    గుడివాడలో నివసిస్తున్న వారిలో ఆధార్ కార్డులు పొందినవారిలో 35శాతం వరకూ అక్రమ కార్డులు పొందినవారేనని సమాచారం.  ఒక్క గుడివాడ పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ విధమైన కేసులు చాలా ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు.  
     
    బెంబేలెత్తుతున్న ఆటో డ్రైవర్లు....

    దివిసీమలో వెలుగుచూసిన నకిలీబీమా పత్రాలు  ఆటో డ్త్రెవర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నకిలీ పత్రాల  వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులకు ఎలాంటి బీమా సౌకర్యం వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారికి భద్రత లేకుండా పోయింది. దివిసీమ కేంద్రంగా  ఏడాదిన్నర నుంచి సంబంధిత శాఖాధికారులకు తెలిసి ఈ బాగోతం సాగుతున్నా  ముడుపులు తీసుకుని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.
     
    రూ.3,893 బీమా రూ.1,500లకే!

    ఆటోకు సంబంధించి   పెంచిన ధరల ప్రకారం ఏడాదికి రూ.11,500 వరకూ బీమా చెల్లించాల్సి ఉంది. ప్రమాదం జరిగినపుడు ఆటోకు, వాహనం నడిపే డ్త్రెవర్, అందులోని ముగ్గురు ప్రయాణికులకు ప్రమాద తీవ్రతను బట్టి బీమా సొమ్ము చెల్లిస్తారు. అలాకాకుండా చాలా మంది డ్రెవర్లు థర్డ్‌పార్టీకి మాత్రమే బీమా చేయిస్తుంటారు. ఇందుకోసం ఏడాదికి రూ.3,893 చెల్లించాల్సి ఉండగా, ఇదికూడా భారంగా భావిస్తున్న డ్త్రెవ ర్ల కోసం అక్రమార్కులు ప్రత్యేక స్కీం పెట్టారు.
       
    కొంతమంది ఆటోడ్త్రెవర్లకు ఈ విషయాన్ని చెప్పి రూ.3,893 విలువగల బీమా పత్రాలను రూ.1,500కే అందజేస్తున్నారు. తనిఖీల సమయంలో బీమా రెన్యూవల్ అయిందా లేదా అని మాత్రమే సంబంధిత అధికారులు పరిశీలిస్తుండటంతో నకిలీ బీమా పత్రాలు చెల్లుబాటవుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి దివిసీమలో ఇలాంటి పత్రాలు 600ఆటోలకు అందజేసినట్లు తెలిసింది.  సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది.  
     

మరిన్ని వార్తలు