హైకోర్టులో ఎంపీఈవోల జీవో

31 Jan, 2015 17:59 IST|Sakshi

హైదరాబాద్: ఆదర్శ రైతుల స్థానంలో మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల(ఎంపీఈవో)ను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని, దానికి అనుగుణంగా జారీ చేసిన జీవో 693ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ జీవోను కొట్టేవేయాలని కోరుతూ నవ్యాంధ్రప్రదేశ్ ఆదర్శరైతుల సంఘం అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి, ఆదర్శరైతు సి.నర్సింహారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

విద్యావంతులైన రైతులను గుర్తించి, వారికి  నెలకు రూ.1000 గౌరవ వేతనంతో ఆదర్శ రైతులుగా 2007లో అప్పటి ప్రభుత్వం నియమించిందని పిటిషనర్లు తెలిపారు. 2007లో ఆదర్శ రైతులుగా నియమితులైన వారి వయస్సు ఇప్పుడు 40 సంవత్సరాలకు పైగా ఉందని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవడానికి సైతం వారు పనికి రారని తెలిపారు. ఆదర్శ రైతులను తొలగించి వారి స్థానంలో ఎంపీఈవోలను నియమించాలనుకోవడం దారుణమని ఆరోపించారు. ఆదర్శ రైతుల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించామని , హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం ఎంపీఈవోలను నియమించాలని నిర్ణయించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన ఎంపీఈవోల నియామకపు జీవోను కొట్టేవేయాలని కృష్ణమూర్తి కోర్టును అభ్యర్థించారు.

మరిన్ని వార్తలు