పార్లమెంట్ ముట్టడికి సిద్ధంకండి

31 Oct, 2013 03:15 IST|Sakshi
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్:షెడ్యూల్ కులాల వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని కోరుతూ డిసెంబర్ 7న పార్లమెంట్ ముట్టడికి మాదిగలు సిద్ధం కావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ కోరారు. బుధవారం తాడేపల్లిగూడెంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఎన్జీవో హామ్‌లో నిర్వహించారు. వీరయ్య మాట్లాడుతూ  వర్గీకరణను జాప్యం చేయటం వల్ల మాదిగ, మాదిగ ఉపకులాల వారు తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ చేయకపోతే మాదిగలకు భవిష్యత్ లేదన్నారు. 
 
 కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడతామన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోబిల్లు ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళాలని, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీసీఐఎం పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై ఆంటోని కమిటీకి నివేదిక అందజేస్తామని, పరిష్కారం చూపకపోతే కమిటీని ఆంధ్రా ప్రాంతానికి రానివ్వమని హెచ్చరించారు.  
 
 మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు.  పలివెల చంటి మాదిగ, ముప్పి డి మోషే మాదిగ, పెనుమాక గాంధీ, మాండ్రు ప్రభాకర్, బైపా రాజేశ్వరరావు, లంకా మోహనబాబు, దూలపల్లి శ్రీను, రాపాక వెంకటేశ్వర్లు, డి.చిన్నజాన్, మర్రి వెంకటేశ్వరరావు, ఉండ్రాజవరపు పెంటయ్య, తొమ్మండ్రు వెంకటేశ్వరరావు, పెదమూర్తి రాజు, విద్యార్థి, యువసేన నాయకులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు