పెళ్లైన 11 నెలలకే కబళించిన మృత్యువు | Sakshi
Sakshi News home page

పెళ్లైన 11 నెలలకే కబళించిన మృత్యువు

Published Thu, Oct 31 2013 2:51 AM

Newly married Vedapati from Kamareddy died in Mahboobnagar Jabbar bus accident

కామారెడ్డి, న్యూస్‌లైన్: దీపావళి వెలుగులు విరజిమ్మాల్సిన ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కుసుమ వేదపతి(27) మృతి చెందారు. తల్లిదండ్రులైన విఠల్, సుశీలకు కడుపుకోత మిగిల్చారు. వేదపతికి 11 నెలల క్రితమే వివాహమైంది. భార్య స్వర్ణలత తెలంగాణ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అత్తింటి వారు అల్లుడు, కుమార్తెను తొలిసారి దీపావ ళి పండుగకు హారతి ఇచ్చేందుకు ఆహ్వానించాలనుకున్నారు. అల్లుడి మరణవార్తతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. పండుగకు ముందుగానే వస్తానని తల్లిదండ్రులు, భార్యకు చెప్పిన వేదపతి మంగళవారం బస్సులో బెంగళూర్ నుంచి బయల్దేరారు. తెల్లారితే హైదరాబాద్‌లో దిగాల్సిన వేదపతి బస్సు ప్రమాదం లో చెలరేగిన మంటలకు ఆహూతయ్యారు.
 
 పొద్దున్నే వస్తానని చెప్పాడు..
 ‘బస్సెక్కుతున్నా నాన్న.. పొద్దున్నే ఇంటికి చేరుతాన ని ఫోన్ చేసిన కొడుకు ఇగ నాకు కానరాడని, నేను బతికెందుకు’ అంటూ వేదపతి తండ్రి విఠల్ రోదిం చడం అందరినీ  కలచివేసింది. డెయిరీ టెక్నాలజీ కళాశాలలో పనిచేసి రిటైర్డ్ అయిన విఠల్ కామారెడ్డి పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్ద జిరాక్స్ సెంటర్‌ను నడుపుతున్నారు. విఠల్‌కు కూతురు, కుమారుడు ఉన్నా రు. ఇద్దరి పెళ్లిళ్లు ఘనంగా జరిపించారు. కుమారుడు ఎంబీఏ పూర్తిచేసి బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తుండడంతో మురిసిపోయారు. కోడలు కూడా ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతుండడంతో ఆమెను ప్రోత్సహించారు. ఇంటి వద్ద ఖాళీగా ఉండి ఏమి చేయలేక, జిరాక్స్ సెంటర్ నడుపుతున్నారు. అయితే కొడుకును రోడ్డు ప్రమాదం బలితీసుకోవడంతో తన కు దిక్కెవరంటూ, తన కొడుకులేని జీవితం ఎందుకంటూ ఆయన రోదించ డం పలువురిని కంటతడిపెట్టించింది.
 
 కొడుకా నన్నొదిలి పోతివా...
 వేదపతి మరణవార్త విన్న తల్లి సుశీల ‘కొడుకా నన్నొదిలిపోతివా’ అంటూ రోదిస్తూ కుప్పకూలిపోయింది. ఆమె కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తీవ్రమైన వేదనతో సుశీల అస్వస్థతకు గురి కాగా బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు.

 వేద‘పతి’ని కోల్పోయిన స్వర్ణలత

భర్త రాకకోసం వేచిచూసిన స్వర్ణల త అతనికరాడన్న చేదునిజం తెలియడంతో కన్నీరుమున్నీరవుతోంది. మంగళవారం రాత్రి బెంగళూర్‌లో బస్సు ఎక్కే ముందు వేదపతి త ల్లిదండ్రులతోపాటు భార్యకు ఫోన్‌చేసి బుధవా రం ఉదయం తొమ్మిది గంటల వరకు ఇంటికి వస్తానని చెప్పారు. రోజులాగే వేదపతి భార్య స్వర్ణలత ఉదయం తెలంగాణ యూనివర్సిటీకి బయల్దేరి వెళ్లారు. అంతలోనే రోడ్డుప్రమాద వార్త టీవీ ఛానళ్లలో ప్రసారం కావడం, అం దులో వేదపతి ఉన్న విషయం ఆయన తల్లిదండ్రులకు తెలిసింది.
 
 దీంతో స్వర్ణలతకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. తన భర్త ప్రాణాలతోనే ఉండవచ్చని పరుగున ఇంటికి చేరిన ఆమెకు గుండె ఆగినంత పనైంది. వేదపతి ఇక లేడనే విషయాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోయింది. వేదపతిపై ఎన్నో ఆశలతో 11నెలలనాడు మనువాడింది. తాను కూడా ఉన్నత చదువులు చదివి భర్తతో కలిసి ఉద్యోగం చేయాలని పట్టుదలతో ఎంబీఏ చదువుతున్న స్వర్ణలత తన జీవితంలో ఇలాంటి కష్టం ఎదురవుతుందని ఊహించలేకపోయింది. రోడ్డు ప్రమాదం వేదపతిని బలిగొనడం ఆమె జీవితంలో విషాదాన్ని మిగిల్చింది.

Advertisement
Advertisement