‘మర్యాదగా ఇల్లు ఖాలీ చెయ్‌ బాబు’

16 Aug, 2019 15:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో వరద ఇంకా ఉదృతమయ్యే అవకాశముందని అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవిఎస్‌ నాగిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ నుంచి 6 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు. కరకట్టలో డ్రోన్‌ వినియోగానికి టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంపై ఆయన ధీటుగా స్పందించారు. ప్రజలను కాపాడటానికి, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికే అధికారులు డ్రోన్‌ను వినియోగించారని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా కరకట్టలో నిర్మాణాలు, ఇతర ముంపు ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. టీడీపీలో అక్రమ కట్టడాన్ని సమర్థించుకోడానికి ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారన్నారు.

కరకట్ట లోపల నిర్మించిన చంద్రబాబు నివాసం అక్రమ కట్టడం కాదా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు. ముంపు వస్తుందనే ముందు జాగ్రత్తతో బాబు హైదరాబాద్‌ వెళ్లిపోయాక కూడా టీడీపీ నేతలు దిగజారిపోయి మరీ ధర్నాలు చేస్తున్నారని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అసహ్యించుకునేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముంపు కష్టాలను గాలికి వదిలేసి... ఇంట్లో ఎవరూ లేని అక్రమ కట్టడం కోసం టీడీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చంద్రబాబు అక్రమ నివాసాన్ని మర్యాదగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు