మిస్టరీ వీడని హరిత హత్య కేసు

4 Feb, 2014 05:34 IST|Sakshi

అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామ శివారులోని గుట్టల్లో 2012 మార్చి 21 తెల్లవారుజామున దారుణ హత్యకు గురైన హరిత (25) కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసులో నిందితులను ఓ అమాత్యుడు రక్షిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దాదాపు రెండేళ్లు కావస్తున్నా కేసు పురోగతి లేకపోవడంతో పోలీసుల చిత్తశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బెళుగుప్ప మండలం ఆవులదిన్నె గ్రామానికి చెందిన హరిత (25) శింగనమల మండలం మట్లగొందిలోని తన అక్క ఇంట్లో ఉండేది.
 
 ఉన్నత విద్య నిమిత్తం అక్క ఇంట చేరిన ఆమె.. ఎస్కే యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేసింది. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా చేరింది. అక్కడ వచ్చే వేతనం తక్కువ కావడంతో ఆర్డీటీలో ఎస్‌టీఎల్ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెను 2012 మార్చి 18న ఇంటర్వ్యూకు పిలిచారు. దీంతో మట్లగొంది నుంచి నగరానికి వచ్చింది. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత నగర శివారులోని ఆర్డీటీ కార్యాలయం నుంచి ఆటోలో ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంది. అప్పటికే సమయం సాయంత్రం 6.30 గంటలు కావడంతో బావ కొర్రి రాముడుకు ఫోన్ చేసి ఆలస్యానికి గల కారణాన్ని తెలియజేసింది.
 
 అలాగే ఓ అపరిచిత వ్యక్తి మీకు సన్నిహితుడినంటూ తనను పరిచయం చేసుకున్నాడని చెప్పింది. ఫోన్‌లో మాట్లాడిన ఆ వ్యక్తి ‘అన్నా నేను శివ. పాపను బస్సు ఎక్కించి పంపుతా’నని చెప్పాడు. అయితే.. గ్రామానికి ఎనిమిది గంటలకు చేరాల్సిన హరిత ఆర్టీసీ బస్సు వచ్చినా అందులో కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఆచూకీ లేకపోవడంతో మార్చి 19న స్థానిక త్రీటౌన్ పోలీసులకు కొర్రి రాముడు ఫిర్యాదు చేశాడు. ఇంటికి వచ్చేందుకు బస్సెక్కినట్లు చెప్పిన హరిత కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. మార్చి 21న బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన గొర్రెల కాపరులు కాలి వున్న గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులకు సమాచారమిచ్చారు.
 రంగంలోకి దిగిన పోలీసులు ఆ మృతదేహం హరితదేనని నిర్ధారించారు. ఆమె వద్ద హ్యాండ్ బ్యాగుతో పాటు పసుపు కొమ్మలు, సెల్‌ఫోన్ లభించాయి. దీంతో ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించి.. ఈ ప్రాంతానికి తీసుకువచ్చి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. సెల్‌ఫోన్‌లోని కాల్ డేటా కూడా తీశారు. అయితే అందులో హంతకులకు సంబంధించిన వివరాలేవీ లభించలేదని అప్పట్లో ఆ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.
 
 అత్యాచారం... ఆపై హత్య!
 హరితను గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై చున్నీతో ఉరివేసి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మార్చి 18 రాత్రే కడతేర్చి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో అనుమానితులను బుక్కరాయసముద్రం పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అంతలో ఓ అమాత్యుడు నిందితులకు మద్దతుగా జోక్యం చేసుకోవడంతో పోలీసులు మిన్నకుండిపోయినట్లు సమాచారం.  ఈ కేసు దర్యాప్తు విషయంపై బుక్కరాయసముద్రం ఎస్.ఐ మోహన్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించానని, ఫైల్‌ను పూర్తిగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు