నాదస్వర విద్వాన్‌ నాగూర్‌ కన్నుమూత

18 Jan, 2019 09:42 IST|Sakshi
నాగూర్‌ సాహెబ్‌ (ఫైల్‌)

1965 నుంచి ఆకాశవాణిలో కచేరీల నిర్వహణ

పలు బిరుదులు అందుకున్న విద్యాంసులు

అద్దంకి: నాదస్వర విద్వాన్‌ నాగూర్‌ సాహెబ్‌ (90 ) గురువారం అద్దంకిలోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కశ్యాపురం గ్రామానికి చెందిన నాగూర్‌ సాహెబ్‌ తండ్రి ఖాశీం సాహెబ్‌ పేరు మోసిన నాదస్వర విద్వాంసులు. తల్లి హుస్సేన్‌భీ. 1930వ సంవత్సరంలో నాగూర్‌ సాహెబ్‌ జన్మించారు. ఆయన సోదరుడు దస్తగిరి సైతం నాదస్వర విద్వాంసులు. అద్దంకి ప్రాంతంలో ఇద్దరూ నాదస్వర ద్వయంగా పేరు గాంచారు. తొలి గురువు అయిన తండ్రి వద్దే సంగీతంలో ప్రాథమిక విద్యను నేర్చుకున్నారు. తరువాత మేనమామ నాగులుప్పలపాడు మండల గొనసపూడికి చెందిన మస్తాన్‌ సాహెబ్‌ దగ్గర ఉన్నత విద్యను నేర్చుకున్నారు.

తమిళనాడులోని తంజావూరు గ్రామానికి చెందిన దొరై కణ్ణన్‌∙ వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. ఆల్‌ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో 1965 నుంచి 2000 సంవత్సరం వరకు నాదస్వర కచేరీలు చేశారు. అక్కడ బీ హైగ్రేడు, ఏ గ్రేడు కళాకారునిగా గుర్తింపు పొందారు. 2011లో తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రముఖ నాదస్వర విద్వాంసుడు పద్మశ్రీ షేక్‌ చినమౌలానా స్మారక అవార్డును, నాదస్వర విద్వాన్, నాద కోవిద బిరుదులను అందుకున్నారు. ఈయన శిష్యుడు ప్రముఖ నాదస్వర విద్వాంసుడు చినమౌలానా మనవడు బాబుల్‌ మధురైలో గొప్ప విద్వాంసుడుగా పేరు పొందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సంగీత దర్శకుడు కె.విశ్వనాథ్‌చే నాదస్వర మణిరత్న బిరుదును పొందారు. సుమారు 5వేల మందికిపైగా ఔత్సాహిక కళాకారులకు హర్మోనియం, నాదస్వరం, ప్లూట్, క్లారినట్‌ వంటి ఎన్నో వాయిద్యాలను నేర్పారు.

నాగూర్‌సాహెబ్‌కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఒక కుమారుడు ఎస్‌కే షాజహాన్‌ గూడూరులో ఎక్సైజ్‌ ఇన్‌చార్జ్‌ సీఐగా పనిచేస్తున్నారు. మరో కుమారుడు తండ్రి వారసత్వాన్ని స్వీకరించి నాదస్వర కళాకారుడయ్యాడు. రెండున్నరేళ్లుగా అనారోగ్య కారణంగా వాయిద్యానికి దూరంగా ఉంటూ గురువారం తన స్వగృహంలో తదిశ్వాస విడిచారు. గాత్ర వాయిద్య కళాకారుల సంఘ నాయకుడు శేషగిరిరావు, కోలాటం కళాకారుడు జాన్‌ సాహెబ్, రంగస్థల కళాకారుడు అద్దంకి నాగేశ్వరరావు, కోటేశ్వరమ్మతోపాటు మరి కొందరు కళాకారులు, నూర్‌ భాషా సంఘ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు