పూర్తిగా కోలుకున్న నెల్లూరు యువకుడు

17 Mar, 2020 05:41 IST|Sakshi

కాకినాడలో మహిళ కరోనాతో చనిపోలేదు

ఏపీలో ‘కరోనా’ లేదు.. 75 కేసులు నెగెటివ్‌

అమరావతి/నెల్లూరు/కర్నూలు/కాకినాడ: రాష్ట్రంలో ఎక్కడా కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) కేసులు లేవని వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 76 మంది కరోనా అనుమానితులకు సంబంధించిన ల్యాబ్‌ రిపోర్టులు అందాయని.. వాటిలో 75 మందికి కరోనా లేదని తేలింది. ఇప్పటివరకు నెల్లూరులో మాత్రమే పాజిటివ్‌ కేసు నమోదైందని.. ఆ యువకుడు కూడా పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేసింది. మరో 13 మందికి సంబంధించిన ల్యాబ్‌ రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపింది. నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మొత్తం 11 మందిని ప్రత్యేక వార్డుల్లో చేర్చి పరీక్షించగా.. 10 మందికి నెగెటివ్‌ వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  

అది కరోనా మరణం కాదు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో కరోనా అనుమానితురాలు సోమవారం మృతి చెందింది. వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా లేదని తేలిందని.. మెదడు వాపు వ్యాధి బారిన పడటంతో ఆమె మృతి చెందిందని వైద్యాధికారులు ప్రకటించారు. అంతర్వేదిపాలేనికి చెందిన ఆ మహిళ ఈ నెల 11న దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి రాగా ముందుజాగ్రత్తగా ఆదివారం కాకినాడ జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేర్చి చికిత్స అందజేశారు. వైద్యులు ఆమె రక్తం, కళ్లె శాంపిల్స్‌ను తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి పంపారు. సోమవారం వేకువజామున ఆమె మృతి చెందింది. ఆమెకు కరోనా లేదని ల్యాబ్‌ రిపోర్టులు వచ్చాయని, ఆమె మెదడు వాపు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు చెప్పారు.  
 

మరిన్ని వార్తలు