బాబూ.. ఏ మొహం పెట్టుకుని దీక్ష చేస్తావ్?

7 Oct, 2013 02:53 IST|Sakshi

అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : ‘చంద్రబాబూ... ఏ మొహం పెట్టుకుని ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు? దీనివల్ల ఏమి సాధిస్తారు? దీక్ష చేపట్టడానికి కాంగ్రెస్ అధిష్టానంతో ఎంత ప్యాకేజీకి డీల్ కుదిరింది? ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల’ని వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ డిమాండ్ చేశారు.
 
 తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు చేపట్టిన 72 గంటల బంద్‌లో భాగంగా మూడో రోజైన ఆదివారం వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నగరంలోనితపోవనం సర్కిల్ వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై తెలుగుజాతిని ముక్కలు చేయడానికి పూనుకున్నాయని విమర్శించారు.
 
 తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెర తీశారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు అన్నీ తెలిసినా ప్యాకేజీలు తీసుకుని నోరుమెదపడం లేదన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత మహానేత వైఎస్, ఎన్‌టీఆర్‌లకే దక్కుతుందన్నారు.

అయితే... ఎన్‌టీఆర్ కుమార్తె అయిన కేంద్ర మంత్రి పురందేశ్వరి పదవులు పట్టుకుని వేలాడుతుండడం శోచనీయమన్నారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే అనర్థాలు, అగచాట్లను దృష్టిలో పెట్టుకునే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఈ దీక్షకు అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు. శంకరనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్రజల మధ్య రాగద్వేషాలు పెంచుతోందని విమర్శించారు. అవినీతి చక్రవర్తిగా పేరొందిన చంద్రబాబు తన బండారం బయటపడకుండా బహిరంగంగానే కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని విమర్శించారు.
 
 రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా ఎవరి కోసం, ఎందుకోసం ఢిల్లీలో దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  పార్టీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి సంస్కృతీ సంప్రదాయాలు  ఇటలీ వనిత సోనియాకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు లింగాల శివశంకరరెడ్డి, మీసాల రంగన్న, ధనుంజయ యాదవ్, కసనూరు రఘునాథరెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, హుస్సేన్‌పీరా, ఉషారాణి, శ్రీదేవి, మిద్దె కుళ్లాయప్ప, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మహానందిరెడ్డి, షెక్షావలీ, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబుళపతి, నాయకులు అశోక్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు