ప్రగతికి దారేది?

1 Oct, 2018 11:56 IST|Sakshi
పనులు ఆగిపోవడంతో మట్టి రోడ్డు నుంచి వస్తున్న దుమ్ము

కదలని ఎన్‌హెచ్‌–4 విస్తరణ పనులు

రూ.306 కోట్ల పనులను సబ్‌ లీజుకు దక్కించుకున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి

పనుల్లో వేగం లేక కలెక్టర్‌ చీవాట్లు

37 కి.మీ రోడ్డులో పూర్తయ్యింది 1.6 మాత్రమే చిత్తూరు అభివృద్ధికి అడ్డంకి

చిత్తూరు అర్బన్‌: రూ.వందల కోట్ల ప్రాజెక్టు.. 37 కి.మీ దూరం రోడ్డు.. ఇప్పటికి పూర్తయ్యింది 1.6 కి.మీ..ఉన్నది ఏడాది మాత్రమే గడువు..ఓ వైపు కలెక్టర్‌ నుంచి చీవాట్లు..మరోవైపు సమయం మించిపోతోంది..ఏం చేయాలి..? ఏం చేద్దాం..! ఇదీ.. చిత్తూరు వైపు జరుగుతున్న జాతీయ రహదారి పనులను సబ్‌ లీజుకు దక్కించుకున్న నలుగురు భాగస్వాముల ఆందోళన. అధికారమే పెట్టుబడిగా రూ.306 కోట్ల విలువైన పనులను బినామీ పేరిట సబ్‌ లీజుకు చేజిక్కించుకున్న చిత్తూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి వ్యూహం బెడిసికొడుతోంది. చిత్తూరు మీదుగా జరుగుతున్న ఎన్‌హెచ్‌–4 పనులు పూర్తిగా స్తంభించడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచడం లేదు. అనుభవం లేకున్నా రూ.వందల కోట్ల విలువైన పనులు పూర్తిచేస్తే ఎటులేదన్నా రూ.50 కోట్ల వరకు మిగుల్చుకోవచ్చనుకున్న టీడీపీ ప్రజాప్రతినిధి పాచిక పారడం లేదు.

జనం కంట్లో దుమ్ము..
బంగారుపాళ్యం మండలం నలగాంపల్లెనుంచి తమిళనాడులోని రాణిపేట సరిహద్దు ఉన్న ఆంధ్ర బార్డర్‌ వరకు చెన్నై–బెంగళూరు జాతీయ రహదారి నాలుగు లేన్ల విస్తరణ పనులను హైదరాబాద్‌కు చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దక్కించుకుంది. కేంద్ర జాతీయ రహదారుల శాఖ ఇందుకోసం రూ.306 కోట్లు కేటాయించింది. గాయత్రీ కంపెనీ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి నాయుడు, పాలసముద్రం జెడ్పీటీసీ చిట్టిబాబు నాయుడు, మరో ఇద్దరు కలిసి ప్రాజెక్టు పనులను సబ్‌లీజుకు తీసుకున్నారు. ఈ పనులు ఆశించిన స్థాయిలో వేగంగా జరగడం లేదు. దీంతోపాటు మొదలైన పూతలపట్టు, పలమనేరు, మదనపల్లె జాతీయ రహదారుల విస్తరణ పనులు 70 శాతం పూర్తయితే చిత్తూరు ప్రోగ్రెస్‌ ఇందులో సగానికి కూడా చేరుకోలేదు. నిర్ణీత గడువు లోపు రోడ్డు పనులు పూర్తవుతాయో లేదో అనే సందిగ్ధత నెలకొంది. పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్నా నిత్యం దుమ్ముధూళితో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా టీడీపీ నేతల్లో చలనం కనిపించడం లేదు.

పుంజుకోని పనులు..
37 కిలోమీటర్ల దూరం జరగాల్సిన రోడ్డు పనులు గతేడాది నవంబరు 15న ప్రారంభించారు. అగ్రిమెంటు ప్రకారం వచ్చే ఏడాది నవంబరు 14వ తేదీకి పూర్తి కావాలి. ఇప్పటివరకు రెండు నాలుగు లేన్ల రోడ్డులో 1.63 కి.మీ మాత్రమే వందశాతం పూర్తయ్యింది. చెరోవైపు అక్కడక్కడ రోడ్డు వేయడంతో సగటున 6.4కి.మీ పూర్తి చేశారు. ఈ దూరంలో 74 ప్రాంతాల్లో కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. 32 మాత్రమే పూర్తి చేశారు. ఇందుకు దశలవారీగా రూ.56.26 కోట్ల బిల్లులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయి వారం రోజులవుతోంది. చేసిన కొద్దిపాటి పనులకు బిల్లులు వస్తేనే మళ్లీ మొదలుపెట్టాలని టీడీపీ నేతలు భీష్మించుకూర్చోవడమే దీనికి ప్రధాన కారణం.

కలెక్టర్‌ ఆగ్రహం..
ప్రతివారమూ ఎన్‌హెచ్‌–4 పనులను పర్యవేక్షిస్తూ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న ఆర్‌వీ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్‌ ప్రద్యుమ్న సమీక్ష నిర్వహిస్తున్నారు. గీర్వాణి ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో తీవ్రజాప్యం నెలకొనడంతో కన్సల్టెన్సీపై కలెక్టర్‌ మండిపడుతున్నారు. పనులను జెడ్పీ చైర్‌పర్సన్‌ సబ్‌లీజుకు తీసుకుని నెమ్మదిగా చేస్తుండడం వల్ల ప్రాజెక్టులో జాప్యం నెలకొందని గతవారం జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ నటిస్తున్న టీడీపీ నేతలు ఇప్పటికైనా సామర్థ్యం ఉన్న వారికి పనులు అప్పగించి పక్కకు తప్పుకుంటారో.. చిత్తూరు అభివృద్ధికి గుదిబండగా మారతారోనని సామాన్యులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

మరిన్ని వార్తలు