15న నీతి ఆయోగ్‌ సమావేశం

2 Jun, 2019 05:41 IST|Sakshi

సీఎం జగన్‌కు ఆహ్వానం

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఈ నెల 15వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకావాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆహ్వానం పలుకుతూ లేఖ రాసింది. మధ్యాహ్నం 2.30 గంటల తరువాత ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ముఖ్యంగా ఆరు అంశాలపై చర్చించనున్నారు.

వాననీటి సంరక్షణ, కరువు పరిస్థితులు– ఉపశమన చర్యలు, ఆకాంక్ష జిల్లాల పథకం– సాధించిన విజయాలు– సవాళ్లు, వ్యవసాయంలో మార్పులు తేవడం (వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ చట్టం, నిత్యావసరాల చట్టం–1955లపై ప్రత్యేక దృష్టితో సంస్కరణలు తేవడం), వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న జిల్లాలపై ప్రధాన దృష్టితో భద్రతా పరమైన అంశాలు, చైర్మన్‌ అనుమతితో ఇతర అంశాలపై చర్చ ఉంటుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, సమాఖ్య స్పూర్తి తదితర అంశాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పలుకుతూ నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ లేఖ రాశారు.   

మరిన్ని వార్తలు