కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో మార్పులుండవు

3 Mar, 2014 23:34 IST|Sakshi

 తాండూరు, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్‌తో పొత్తు, విలీనం.. ఏది జరిగినా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో అధిష్టానం మార్పులు చేయదని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ స్థానాలపైనే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పొత్తా, విలీనమా అనేది పక్కనపెడితే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై సోనియాగాంధీకి పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడిందని, కేసీఆర్ కూడా అదేవిధంగా ఉంటారని అనుకుంటున్నట్టు చెప్పారు. సర్వేల ప్రకారం గెలిచే నాయకులకే జిల్లాలో ఎమ్మెల్యే టికె ట్లు వస్తాయని, ఈ విషయంలో తాను ప్రత్యేక చొరవ తీసుకుంటానని అన్నారు.

 మున్సిపల్ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండంగానే భావిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో టికెట్ దక్కదనే కొందరు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. వికారాబాద్‌లో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. రెండేళ్లు మంత్రిగా జిల్లాలో ని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషిచేయడం సంతృప్తినిచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం సమర్థవంతమైన నేతనే సీఎంగా చేయాలన్నా రు. సమావేశంలో పార్టీ నాయకులు రమేష్, విశ్వనాథ్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, అనురాధ ముదిరాజ్, అపూ, డా.సంపత్‌కుమార్, ధారాసింగ్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు