‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ అందరూ పాటించాల్సిందే

10 Mar, 2020 05:40 IST|Sakshi

అన్నిచోట్లా పూర్తి స్థాయిలో అమలుకు తాజాగా ఆదేశాలు

విద్యాశాఖాధికారులకు పర్యవేక్షణ బాధ్యత

సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో చిన్నారులు ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకోవడానికి, ఒకటి, రెండు రోజులైనా వారిపై పుస్తకాల భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ను కొన్ని పాఠశాలలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక విద్యా శాఖపై నిర్వహించిన తొలి సమావేశంలోనే ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ను అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల ఒకటి, మూడో శనివారాల్లో పిల్లలు స్కూళ్లకు పుస్తకాల బ్యాగ్‌లు లేకుండా వస్తారు. కేవలం ఆటపాటలతో కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకొనేందుకు ‘సృజన–శనివారం సందడి’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. అన్ని స్కూళ్లూ దీన్ని పూర్తి స్థాయిలో పాటించాల్సి ఉంది. కానీ కార్పొరేట్, ప్రయివేట్‌ పాఠశాలలు పట్టించుకోవడం లేదని విద్యా శాఖ దృష్టికి వచ్చింది.

కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా దీన్ని తూతూ మంత్రంగా చేపడుతున్నట్లు గమనించింది. ఈ నేపథ్యంలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లోనూ నిర్ణీత పద్ధతిలో ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.   ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు. డిప్యూటీ డీఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ బాధ్యులైన హెచ్‌ఎంలు ప్రతి నెల ఒకటి, మూడో శనివారాల్లో తప్పనిసరిగా ఆయా పాఠశాలలను సందర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2 ప్రయివేటు, 1 ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, తమ విజిటింగ్‌ రిపోర్టును సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న ఈ కార్యక్రమంపై తీసిన వీడియోకు జాతీయ స్థాయిలో ఇటీవల అవార్డు లభించింది. 

కార్యక్రమం ఇలా చేయాలి..
1, 2 తరగతులు..
పాడుకుందాం: పిల్లలతో అభినయ గేయాలు, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు పాడించాలి. పద్యాలు, శ్లోకాలు చెప్పించాలి.
మాట్లాడుకుందాం : కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొడుపు కథలు, పజిల్స్, సరదా ఆటలు ఆడటం (అన్నీ పిల్లలతోనే చేయించాలి).
నటిద్దాం : నాటికలు, స్క్రిప్టులు, మైములు, ఏకపాత్రాభినయం, నృత్యం, అభినయం.
సృజన : బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంకమట్టితో బొమ్మలు, నమూనాలు, మాస్కులు చేయడం, అలంకార వస్తువుల తయారీ.

3, 4, 5 తరగతులు..
సృజన : బొమ్మలుగీయడం, రంగులు వేయడం, బంకమట్టి వినియోగించి నమూనాలు రూపొందించడం, మాస్కులు చేయడం, అలంకరణ వస్తువుల తయారీ, నాటికలు, స్క్రిప్టులు, మైములు, ఏకపాత్రాభినయం, నృత్యం, అభినయం వంటివి చేయించాలి.
తోటకు పోదాం, పరిశుభ్రం చేద్దాం : బడితోటలో పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం, పరిసరాల పరిశుభ్రతను నేర్పడం.
చదువుకుందాం : పాఠశాల గ్రంథాలయాల్లోని పుస్తకాలను ఎంపిక చేసుకొని చదవడం, చర్చించడం, కథలు చదవడం, రాయడం.
విందాం.. విందాం.. : ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయతీ అధికారి, కుంటుంబ సంక్షేమ అధికారి, పోస్టాఫీసు సిబ్బంది, వ్యవసాయదారుడు, వ్యాపారి, స్థానిక ప్రజా ప్రతినిధి, తదితరులను బడికి ఆహ్వానించి వారితో మాట్లాడించడం. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా