నిధులివ్వరు... నీళ్లూ ఇవ్వరు

17 Apr, 2015 04:47 IST|Sakshi
నిధులివ్వరు... నీళ్లూ ఇవ్వరు
  • ప్రాధాన్యతా ప్రాజెక్టులకూ కేటాయింపులు అంతంతే
  • అందులో రాయలసీమ ప్రాజెక్టులకు
  • నిధుల కేటాయింపు అరకొరే..
  • వేగంగా పూర్తి చేస్తామంటూ సర్కారు కబుర్లు..
  • అందరూ వద్దంటున్నా పట్టిసీమపై ప్రేమ..
  • బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు ఊసే లేని వైనం
  • ఇతర ప్రాజెక్టుల కేటాయింపుల్లో కోతపెట్టి..  దీనికి వెచ్చించే అవకాశం!

  • అన్ని ఏర్పాట్లు చేస్తే, కుళాయి తిప్పిన వెంటనే నీళ్లొస్తాయి. మరి నీళ్లిచ్చిన ఘనత దాన్ని తిప్పిన వారిదే అవుతుందా? అందులో నీళ్లు రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన వారికి చెందుతుందా? హంద్రీ-నీవాలో మోటార్లు ఆన్ చేసిన తనకే అనంతపురం జిల్లాకు నీళ్లిచ్చిన ఘనత దక్కుతుందని చెప్పుకుంటున్న చంద్రబాబు బండారం ఇదీ.. ఆ ప్రాజెక్టు పనులు ఎవరి హయాంలో పూర్తయ్యాయనే విషయాన్ని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఒక్క హంద్రీ-నీవా ప్రాజెక్టే కాదు.. జలయజ్ఞం కింద మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి, వేగంగా పనులు చేసి ముగింపు దశకు చేర్చిన ప్రాజెక్టుల్లో.. తోటపల్లి బ్యారేజ్, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వంశధార రెండోదశ, వెలిగొండలను ఇప్పుడు బాబు ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాజెక్టుల కింద చేపట్టి.. వాటి ఘనత తనదేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అందరూ వ్యతిరేకిస్తున్న పట్టిసీమ లిఫ్ట్‌ను కూడా ఆ జాబితాలోనే చేర్చింది. అయితే ఇలా గుర్తించిన వాటినీ వేగంగా పూర్తి చేయడానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఆయా ప్రాజెక్టులవారీగా పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది. ఆ వివరాలివీ..
     
    అందరూ వ్యతిరేకిస్తున్నా పట్టిసీమపై పట్టు..
    గోదావరిపై పట్టిసీమ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి పోలవరం కుడికాల్వకు 80 టీఎంసీల నీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనివల్ల గోదావరి డెల్టా బీడుబారుతుందని, కృష్ణా డెల్టాకు నీరందే గ్యారంటీ లేదని, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలు వాటా కోరితే.. కృష్ణా నికరజలాల్ని కోల్పోవాల్సి వస్తుందని టీడీపీ మినహా వివిధ పార్టీలు, ప్రజలు, రైతుసంఘాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిపట్టుదలతో ముందుకెళుతోంది. ప్రాజెక్టు చేపట్టడానికి రూ.1,300 కోట్ల పరిపాలనా అనుమతులిచ్చి ప్రారంభోత్సవమూ చేసింది. ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ప్రాజెక్టు పేరే లేదు. అంటే రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులకు కోత పెట్టి, దీనికి ఖర్చు చేస్తారనే అనుమానం అధికారుల్లో ఉంది. ప్రజలు కోరుకుంటున్న ప్రాజెక్టులకుగాక, కాసుల కక్కుర్తితో చంద్రబాబు కోరుకుంటున్న ప్రాజెక్టుకు నిధులు ఖర్చుచేసి పూర్తి చేస్తే రాష్ట్రానికి లాభంకంటే నష్టమే ఎక్కువ ఉంటుందనే ఆందోళన నెలకొంది.
     
    తోటపల్లి బ్యారేజ్-నిధుల కేటాయింపు అంతంతే..
    తోటపల్లి బ్యారేజ్‌ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1.84 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటికోసం 42 చెరువులను నింపడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించిన దీనికి చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో ఖర్చుచేసింది రూ.3 కోట్లే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.399 కోట్లు వ్యయం చేశారు. తర్వాత రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేశాయి. 2014 మార్చి 31 వరకు రూ.609.61 కోట్లు ఖర్చుపెట్టి 80 శాతం పనులు పూర్తి చేశారు. తాజాగా బాబు అధికారంలోకి వచ్చాక 2014-15 ఆర్థిక సంవత్సరంలో(2015 ఫిబ్రవరి వరకు) రూ.12 కోట్లు ఖర్చుపెట్టారు. సవరించిన అంచనాలప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.774.9 కోట్లు. భూసేకరణ ఇంకా పూర్తవలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు రూ.162 కోట్లు కేటాయించారు. కాంట్రాక్టర్లకు ధరల పెంపునకు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో.. ఈ ఏడాది కేటాయించిన నిధులు వారికి చెల్లించడానికి సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 20 శాతం పనులు, భూసేకరణ పూర్తి చేయడానికీ ఈ ఏడాది నిధులిస్తే... 1.84 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని, కానీ నిధుల కేటాయింపు అంతంతేనని అంటున్నారు.
     
    హంద్రీ-నీవా సుజల స్రవంతి- బడ్జెట్‌లో ఇచ్చింది రూ.200 కోట్లే!
    దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతమున్న అనంతపురం జిల్లాకు తాగు, సాగు నీరివ్వడంతోపాటు రెండోదశలో చిత్తూరు జిల్లాకూ నీరివ్వడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,850 కోట్లు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లలో చేసిన ఖర్చు రూ.13 కోట్లే. వైఎస్ హయాంలో అనంతపురం జిల్లాకు ఎంత ఖర్చయినా నీళ్లివ్వాలనే లక్ష్యంతో రూ.4,340 కోట్లు ఖర్చుపెట్టి తొలిదశను ముగింపునకు తెచ్చారు. తర్వాత ప్రభుత్వాలు రూ.2,143 కోట్లు ఖర్చు చేశాయి. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే.. హంద్రీ-నీవా ద్వారా అనంతపురం జిల్లాకు కొంతమేర నీళ్లిచ్చారు.
     
    కాలువల్లో చిన్న పెండింగ్ పనులు పూర్తి చేసి ఉంటే.. మరింతగా నీటిని తరలించడానికి అవకాశముండేది. కానీ దీన్ని సర్కారు వినియోగించుకోలేదు. గత ప్రభుత్వాలు పూర్తి చేసిన మేరకు నీళ్లివ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసినపని కేవలం పంపులు ఆన్ చేయడమే. కానీ అనంతపురం జిల్లాకు నీళ్లిచ్చిన ఘనత తనదిగా చెప్పుకుంటున్న బాబు తీరును చూసి నీటిపారుదలశాఖ ఇంజనీర్లు నవ్వుతున్నారు. హంద్రీ-నీవా పూర్తికి రూ.1,100 కోట్లు అవసరమని, ఆ మేరకు నిధులిచ్చి తానే పూర్తిచేశానని చెప్పుకోవడానికి వీలున్నా.. ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించింది రూ.200 కోట్లేనని పేర్కొంటున్నారు. అది కూడా కాంట్రాక్టర్లు రెండేళ్లుగా చేసిన పనులకు అధిక ధర చెల్లించడానికే సరిపోతాయంటున్నారు.
     
    గాలేరు-నగరి సుజల స్రవంతి- అరకొర కేటాయింపు
    రాయలసీమను సస్యశ్యామలంగా మార్చడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుకు బాబు హయాంలో చేసిన ఖర్చు రూ.17 కోట్లే. వైఎస్ హయాంలో గాలేరు-నగరికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఉన్నంతకాలం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగింది. మహానేత మరణాంతరం వచ్చిన పాలకులు ఈ ప్రాజెక్టును చిన్నచూపు చూపడంతో నిర్మాణం అటకెక్కింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.7,216.45 కోట్లు. వైఎస్ హయాంలో దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు. తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు, తాజాగా బాబు అధికారంలో ఉన్న 11 నెలల్లో.. మొత్తం కలపి చేసిన వ్యయం రూ.330 కోట్లే. ఈ ఏడాది బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు రూ.169.58 కోట్లు. ఇంత తక్కువ కేటాయింపులు జరిగితే.. ప్రాజెక్టుపై ఆశలు వదులుకోవాల్సిందేనని అధికారులంటున్నారు. మొత్తం పనులన్నీ పూర్తయితే శ్రీశైలం బ్యాక్‌షోర్ నుంచి 38 టీఎంసీల వరద నీటిని ఏటా ఆగస్టు, నవంబర్ నెలల మధ్య తరలించి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.90 లక్షల ఎకరాలకు నీరివ్వచ్చు.
     
    వంశధార ప్రాజెక్టు రెండోదశ - పూర్తయ్యేది ఎప్పుడు?
     వంశధార రెండోదశ కింద రెండు ఫేజ్‌లు ఉన్నా యి. తొలి ఫేజ్ అంచనా వ్యయం రూ.209 కోట్లు, మలి దశ అంచనా వ్యయం రూ.933 కోట్లు. బాబు తొమ్మిదేళ్ల పాలన లో రూ.44.26 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్ కలల ప్రాజెక్టుగా దీన్ని చేపట్టి తన హయాంలో రూ.657 కోట్లు ఖర్చు చేసి నిర్మాణ ప్రగతికి వేగం అందించారు. తర్వాత ప్రభుత్వాలు రూ.138.96 కోట్లు ఖర్చు చేశాయి. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది రూ.63 కోట్లే. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించినా.. తగినన్ని నిధులివ్వకపోవడంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేదానిపై ఉత్తరకోస్తా ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.
     
    వెలిగొండ ప్రాజెక్టు- ప్రభుత్వంలో చలనమేదీ?
     ఈ ప్రాజెక్టును పూర్తిచేయడంద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడం, దుర్భిక్ష, ఫ్లోరైడ్ ప్రభావిత 30 మండలాల్లోని 15 లక్షలమందికి తాగునీటి సౌకర్యం కల్పించడం లక్ష్యం. చంద్రబాబు గత పాలనాకాలంలో రూ.13 కోట్లు కేటాయించారు. కానీ అది కూడా ఖర్చుపెట్టలేదు. ప్రాజెక్టు శంకుస్థాపనకు శిలాఫలకం వేయడానికిమాత్రం రూ.10 లక్షలు ఖర్చుచేశారు. తర్వాత అధికారం చేపట్టిన వైఎస్సార్ రూ.4,785 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2005 డిసెంబర్ 28న సైట్ క్లియరెన్స్, 31-3-2006న పర్యావరణ అనుమతి, 30-9-09న స్టేజ్-1 అటవీ అనుమతి లభించాయి. ఇప్పటివరకు సుమారు రూ.3,674 కోట్లు ఖర్చుచేశారు. తాజా అంచనాలప్రకారం ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కనీసం రూ.550 కోట్లు కేటాయించాలంటూ జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ఇచ్చింది రూ.153.89 కోట్లే. ఇంకా 6,200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.

    భూసేకరణకు సంబంధించి తాజా చట్టాన్ని తమకు వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కనీస చర్యలూ చేపట్టట్లేదు. ఇటీవల టన్నెల్ బోరింగ్ మెషీన్(సొరంగం తవ్వే యంత్రం)లకు సంబంధించి కొత్త సమస్య లేవనెత్తారు. లోపల నల్లరాయి పడిందని, తద్వారా బ్లేడ్‌లు విరిగిపోతూ పనులు మందకొడిగా సాగుతున్నాయని, దీనివల్ల తమకు వ్యయం పెరుగుతుందంటూ కాంట్రాక్టర్ వెనుకంజ వేశారు. డాలర్ రేటు పెరగడం, కరెంటు యూనిట్ కాస్ట్ కూడా ఇటీవలికాలంలో పెరిగినందున.. వాటికీ అదనంగా నిధులివ్వకపోతే పనులు చేయలేమంటూ చేతులెత్తేశారు. కానీ ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపట్లేదు.

మరిన్ని వార్తలు