ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ డిగ్రీలు చెల్లవు!

12 Mar, 2018 01:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్న చందమిది. మనరాష్ట్రంలో వైద్యవిద్యలో పలు కోర్సులకు వేదికైన ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నిర్వహించే కోర్సులకే విలువ లేదంటే పరిస్థితి ఏంటో అంచనా వేయచ్చు. తాజాగా హోమియోలో ఎండీ పూర్తిచేసిన అభ్యర్థులకు అధికారులు షాక్‌ ఇచ్చారు. రాష్ట్రంలో రాజమండ్రి, గుడివాడ, కడపల్లో హోమియో వైద్య కళాశాలలున్నాయి. ఇక్కడ సిబ్బంది లేకపోవడంతో వైద్యవిద్యకు విఘాతం కలుగుతోందన్న కారణంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ హోమియోలో ఎండీ కోర్సులను ప్రవేశపెట్టింది.

ఇప్పటికే నాలుగైదు బ్యాచ్‌లు ఇక్కడ ఎండీ పూర్తిచేసి ఆయా హోమియో కళాశాలల్లో పనిచేస్తున్నారు. తాజాగా డీపీసీ(డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) ద్వారా పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పదోన్నతులకు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పరిధిలో ఎండీ పూర్తి చేసిన వారు అర్హులు కాదని మూడు కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు ఆయుష్‌ కమిషనరేట్‌లో ఉన్న ఓ అదనపు సంచాలకులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్నే ప్రభుత్వం స్వీకరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

కొందరు అభ్యర్థులు పూణె, పాట్నా, మహరాష్ట్ర తదితర ప్రాంతాల్లో కళాశాలలకు వెళ్లకుండానే ఏడాదికోసారి వెళ్లి మేనేజ్‌ చేసుకుని సర్టిఫికెట్లు తెచ్చుకుని లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీరు పదోన్నతుల జాబితాలో ఉన్నారు. వాళ్లంతా కలసి ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో చదివిన వారిని అనర్హులుగా చేసేందుకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు అడిషనల్‌ కమిషనర్‌తో కుమ్మక్కై ఇలా చేశారని సొంత రాష్ట్రంలో చదివిన అభ్యర్థులు వాపోతున్నారు. వెంటనే పదోన్నతులు ఆపేయాలని, లేదంటే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని బాధితులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు