బదిలీలకు వేళాయె!

27 May, 2019 13:24 IST|Sakshi

ఒంగోలు సిటీ:ఉద్యోగుల బదిలీలకు వేళయింది. పని చేయడానికి ఎక్కడైతే బాగుంటుందన్న ఆలోచనల్లో  పడ్డారు. కొందరైతే తాము ప్రయత్నాల్లో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. త్వరలోనే నియామకాల కోలాహలం ప్రారంభంకానున్నట్లు సూచనలు కన్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విధులను నిర్వహించడానికి పలువురు అధికారులు జిల్లా నుంచి పొరుగు జిల్లాలకు వెళ్లారు. అక్కడి ఉద్యోగులు మన జిల్లాలో పని చేయడానికి వచ్చారు. ఎన్నికల ప్రక్రియ మొత్తంగా ముగిసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా ఆదివారంతో ముగిసింది. ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం ఏర్పడే నూతన ప్రభుత్వం కొత్త ఒరవడితో ప్రజాసంక్షేమానికి ముందుకు సాగుతోంది. జగన్‌ ఆశయాలకు అనుగణంగా పని చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందనడంలో సందేహం లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రధాన కేడర్లలో పని చేస్తున్న ఉద్యోగులకు బదిలీలు అనివార్యం కానున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

జిల్లాలో ప్రధానమైన రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల్లో భారీగా స్థాన చలనాలు ఉండవచ్చని భావిస్తున్నారు. తహశీల్దార్‌ కేడర్‌లో ఉన్న అధికారులు సార్వత్రిక ఎన్నికల విధులను నిర్వహించడానికి నెల్లూరు, గుంటూరు జిల్లాలకు వెళ్లారు. ఇక్కడి నుంచి 48 మంది అధికారులు వెళ్లారు. అలాగే నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి ఇక్కడికి తహశీల్దార్లు వచ్చారు. కొందరు అధికారులు సచివాలయం నుంచి వచ్చారు. పదోన్నతుల ద్వారా జిల్లాకు కేటాయింపుజరిగి వచ్చిన వారు ఉన్నారు. తహశీల్దార్లు త్వరలోనే తిరిగి జిల్లాకు రానున్నారు.

 జిల్లాలోని ఎంపీడీఓలు 34 మంది గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి మరి కొన్ని జిల్లాలకు వెళ్లారు. అలాగే వివిధ జిల్లాల నుంచి ఎన్నికల విధులను నిర్వహించడానికి 29 మంది ఇక్కడికి వచ్చారు. ఎన్నికల్లో అధికారుల వద్ద సహాయకులుగా, లైజనింగ్‌ అధికారులుగా, ఎన్నికల పరిశీలకుల వద్ద రకరకాల విధుల్లో ఉన్నారు. వీరిని త్వరలోనే విధుల నుంచి రిలీవ్‌ చేయనున్నారు.
  పోలీసు అధికారుల విషయంలోనూ అంతే. పదోన్నతుల ద్వారా వచ్చిన వారు, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. ఎన్నికల కోసంగా జరిగిన పదోన్నతుల్లో జిల్లాలో వివిధ హోదాల్లో విధులను నిర్వహిసున్న వారు ఉన్నారు. ఎన్నికల షెడ్యూలు వచ్చే ముందు కూడా పలువురు కానిస్టేబుళ్లు, ఆ పై కేడర్లలోని అధికారులకు పోస్టింగ్‌లు పడ్డాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీలు పెద్ద ఎత్తున ఉంటాయన్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే పోలీసు వర్గాల్లో బదిలీపై చర్చ మొదలయ్యాయి.

అన్ని కేడర్లలోనూ.. స్థాన చలనాలు
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొందరు సర్వీసు నిబంధనలను అతిక్రమించి ఆ పార్టీ నాయకులకు విశిష్ట సేవలను అందించిన వారు ఉన్నారు. జిల్లా నుంచి ఎన్నికల సంఘానికి పలువురు పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులపై ఫిర్యాదులు వెళ్లాయి. ప్రధాన శాఖల్లో పని చేస్తున్న వారితో పాటు జిల్లాలోని ప్రధానమైన శాఖల్లో అన్ని కేడర్లలోని ఉద్యోగులకు స్ధానచలనం తప్పదని అంటున్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు మినహా 97 ప్రభుత్వ శాఖల్లో వివిధ కేడర్లలో 27 వేల మంది పని చేస్తున్నారు. ఇందులోని కొన్ని ప్రధాన శాఖల్లో బదిలీ నియమ నిబంధనలను అనుసరించి బదిలీలు జరిగే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వం బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తుందన్న అంచనాలు అధికారుల్లో ఉన్నాయి. అయితే ప్రధాన పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ వంటి శాఖలతో పాటు మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉందంటున్నారు. వీఆర్వోలను తాలూకాలను పరిగణలోకి తీసుకొని ఒక తాలూకా నుంచి మరో తాలూకా పరిధిలోకి బదిలీలు ఉండే అవకాశం ఉంది. గతంలో ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. అప్పట్లో కలెక్టర్‌ వీఆర్వోలను సమూలంగా బదిలీకి పూనుకొని తర్వాత పెండింగ్‌లో ఉంచారు. ఈ దఫా బదిలీలు క్షేత్ర స్థాయిలో కచ్చితంగా పెద్ద ఎత్తున జరుగుతాయని అంటున్నారు.

అడ్డగోలుగా వ్యవహరించిన వారికి బెరుకు
ఎన్నికల విధుల్లో అడ్డగోలుగా వ్యవహరించిన వారిలో బెరుకుతనం మొదలయ్యింది. కచ్చితంగా అప్రధాన్యం గల చోటికి బదిలీ తప్పదన్న ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లను చేర్పించే దగ్గర నుంచి తొలగింపులు ఇతర వ్యవహారాల్లో అడ్డగోలుగా కొందరు అధికారులు వ్యవహరించారు. వారికి మరి కొందరు ఉద్యోగులు వంత పలికారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెప్పినట్లుగా కొందరు వ్యవహరించి ఇబ్బంది పెట్టినట్లుగా సమాచారం. అలాంటి వారు స్వతహాగానే బెరుగ్గా ఉన్నారు. ఈ బదిలీల్లో తమ పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. బదిలీల సంకేతాలు వెలువడిన నేపథ్యంలోనే ఎన్నికల్లో అడ్డగోలుగా వ్యవహరించిన వారికి జ్వరం పట్టుకుంది.

మంచి పేరున్న వారికి తగిన గుర్తింపు
ప్రజల్లో మంచి పేరున్న అధికారులకు  ఉద్యోగులకు తగిన  గుర్తింపు లభించనుందన్న సంకేతాలున్నాయి. ఐదేళ్లు ఎలాంటి ఫోకల్‌ పోస్టింగ్‌ల్లో లేకండా ఎక్కడికి వేస్తే అక్కడ ఉద్యోగం చేసిన వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. అలాంటి వారికి ఈ ఎన్నికల్లో తగిన గుర్తింపు వచ్చింది. పై అధికారులకు ఇబ్బంది కలిగించకుండా ఏ విధంగా పని చేశారో వారి పని తనం చూశారు. అలాం టి వారికి ఈ బదిలీల్లో తగిన గుర్తింపు లభించనుంది. ప్రజలతో ముఖ్యంగా మంచి సంబంధాలు, ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్ధాయిలో నూరు శాతం అమలు కాని  పక్షంలో ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు. చిత్తశుద్ధితో పని చేసే ఉద్యోగులకు తగిన ఫోకల్‌ సీట్లు అడక్కుండానే అవి వారిని వరిస్తాయంటున్నారు.

ఉద్యోగులపై వేధింపులుఉండవన్న భరోసా
జగన్‌ ప్రభుత్వంలో ఉద్యోగులపై ఎలాంటి వేధింపులు ఉండవన్న భరోసా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి వారం ఉద్యోగులకు న్యాయబద్ధమైన సెలవు దినాల్లో వారిని ఎంత పని ఉన్నా కదిలించరు. వీడియో సమీక్షలు, ఇతర సమీక్షలు పండుగలు, ఇతర సెలవు దినాల్లో ఉండే ప్రసక్తి లేదంటున్నారు. ఇక పోలీసులకు కూడా సెలవులను ఇచ్చే విధానాన్ని ఆలోచించే అవకాశం ఉంది. ఉద్యోగులపై అనవసరపు వేధింపులకు ఈ ప్రభుత్వం చెల్లుచీటీ ఇవ్వనుందన్న భరోసా కల్పిస్తోంది.

అడ్‌హాక్‌ పదోన్నతులకు ప్రయత్నాలు
జిల్లాలో 12 మంది తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీటీలు కొత్తగా జిల్లాకు కొందరు వచ్చారు.  ఎన్నికల విధుల్లో వారి సేవలను ఉపయోగించుకున్నారు. వీరిలో ప్రోడీటీలు ఉన్నారు. ఇక్కడ సీనియర్‌ ఉప తహశీల్దార్లు కొందరికి  ఎన్నికల ముందు పదోన్నతులు పూర్తిగా జరగలేదు. జిల్లాలో ఖాళీగా ఉన్న తహశీల్దార్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిక్ట్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) జరగాల్సి ఉంది. సీసీఎల్‌ఏ కార్యాలయంలోనే తగిన సిబ్బంది లేరు. వివిధ కేడర్లలో అధికారులు లేరు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో కలెక్టర్‌ అధ్యక్షతన సీనియర్‌ డీటీలకు అడ్‌హాక్‌ పదోన్నతి ఇచ్చి వారిని తహశీల్లార్లుగా నియమించే అవకాశం ఉంది. ఇలాంటి వారు 8 మంది అధికారులు సీనియారిటీ కలిగి ఉన్నారు.వీరికి త్వరలోనే అడ్‌హాక్‌ ఇచ్చి తహశీల్లార్‌ పోస్టింగ్‌లను ఇవ్వడానికి కలెక్టర్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంది.అయితే బదిలీల మార్గదర్శకాల అనంతరం ఈ ప్రక్రియ జరుగుతుందా..అంతకు ముందే జరపాలా అన్న అంశంపై ఇంకా ముందుకు పోలేదు.

ఫారెన్‌ సర్వీసులకు ఫుల్‌స్టాప్‌
జిల్లాలో ఫారెన్‌ సర్వీసులు కింద ఒక శాఖలోని ఉద్యోగులు ఇతర శాఖల్లో పని చేస్తున్నారు. రెవెన్యూ శాఖలోని వారు పౌరసరఫరాల శాఖలో డీటీలు, ఎఫ్‌ఐలుగా పని చేస్తున్నారు. రెవెన్యూలోనే సిబ్బంది కొరత ఉంది. రెవెన్యూ నుంచి ఆ శాఖకు వెళ్తున్న ఆనవాయితీ గత కొన్నేళ్లుగా ఉంది. జాయింట్‌ కలెక్టర్‌ పౌరసరఫరాల శాఖకు అధికారిగా ఉన్నందున వారి ద్వారా ఫారెన్‌ సర్వీసులకు వెళ్తున్నారు.అలాగే డ్వామా, డీఆర్‌డీఏ ఇతర శాఖల్లో రెవెన్యూ నుంచి ఫారెన్‌ సర్వీసులకు వెళ్తున్నారు. దీంతో రెవెన్యూలోని అన్ని విభాగాల్లో పనులు కుంటుపడ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దఫా ఫారెన్‌ సర్వీసులకు ఫుల్‌స్టాప్‌ పెట్టేయోచనలో అధికారులు ఉన్నారు. జిల్లా అధికారులకు స్థాన చలనం ఉన్నందున జిల్లాలో ఎక్కవ కాలం పని చేసిన అధికారులు ఉన్నారు.వీరు నూతన ప్రభుత్వంలో ఫోకల్‌ పోస్టింగ్‌లకు  తమ ప్రయత్నాలను ప్రారంభించినట్లుగా సమాచారం.

త్వరలోనే రిలీవ్‌ ఉత్తర్వులు
జిల్లా నుంచి ఇతర జిల్లాలకు ఎన్నికల విధుల కోసం వెళ్లిన అధికారులకు త్వరలోనే రిలీవింగ్‌ ఉత్తర్వులు వెలువడనున్నాయి. జూన్‌ మొదటి వారంలోగా ఇక్కడనున్న వారు వారు పని చేస్తున్న జిల్లాలకు వెళ్తారు. జిల్లా నుంచి వెళ్లిన ఎంపీడీఓలు 34 మంది, తహశీల్దార్లు ఇతర అధికారులు జిల్లాకు రానున్నారు. ఇప్పటికే వీరి రిలీవింగ్‌ దస్త్రం రాష్ట్ర అధికారుల పరిశీలనలోఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు