వైఎస్ జగన్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

25 Nov, 2014 01:43 IST|Sakshi
వైఎస్ జగన్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌కు సోమవారం ప్రమాదం తప్పింది.  ప్రకాశం జిల్లా పర్యటనకుగాను జగన్ గన్నవరం విమానాశ్రయంనుంచి రోడ్డు మార్గంలో ఒంగోలు వెళుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని కుంచనపల్లి బకింగ్ హాం కెనాల్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి కాన్వాయ్‌లో ముందుగా వెళుతున్న వాహనం ఒక్కసారిగా కుడివైపుకు వచ్చింది. దీంతో వెనుకనే వస్తున్న గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు, దాని వెనుకనే వస్తున్న కనిగిరి వైఎస్సార్‌సీపీ నాయకులు బుర్రా మధుసూదనరావు కారు ఒక్కసారిగా ఆగాయి.
 
 వాటి వెనుకనే వస్తున్న పోలీసుల రోప్ వే వ్యాను బ్రేకులు పడక ఆ రెండు కార్లనూ ఢీకొంది. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కారు రోప్‌వే వ్యాను వెనుక భాగంలో ఢీకొట్టింది. ఈ సంఘటనలో రోప్‌వే వ్యానులో వున్న కానిస్టేబుల్ జనార్థనరావు ముందుకు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. మిగతా కార్లలోని వారెవ్వరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్లు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు ప్రమాదానికి కారణమైన రోప్‌వే వ్యాన్ డ్రైవర్‌ను పంపించి వేశారు. ప్రతిపక్ష నేత వస్తున్నప్పుడు కనీసం ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు రోడ్డు వెంబడి ఒక్క కానిస్టేబుల్‌ను కూడా నియమించకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు