మళ్లీ విలేజ్ మాల్స్ ! | Sakshi
Sakshi News home page

మళ్లీ విలేజ్ మాల్స్ !

Published Tue, Nov 25 2014 1:41 AM

Village mall again in Vizianagaram

 విజయనగరం కంటోన్మెంట్:  తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రకటించిన విలేజ్ మాల్స్‌ను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు యత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో  బహుళార్థక  సూపర్‌మార్కెట్లను ఏర్పాటుచేయనున్నారు. అయితే అసలే పూర్తి స్థాయి రేషన్ సరుకులు ఇవ్వకుండా అవస్థల పాల్జేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వాటిని విలేజ్ సూపర్ మార్కెట్లుగా తీర్చిదిద్దుతామని చెబుతుండడంపై డీలర్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న డీలర్లందరూ తమ చిరునామాలు, ఫొటోలు, ఆధార్, ఓటరు కార్డు, పాన్ నంబర్ తదితర వివవరాలు సమర్పించాలని  మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామాల్లో విలేజ్ మాల్స్‌ను ఏర్పాటు చేస్తామని  గతంలో అధికారంలో ఉన్నప్పుడు  ప్రకటించిన  టీడీపీ ప్రభుత్వం, తరువాత దాని ఊసే మరచిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిలో భాగంగా గ్రామాల్లోని రేషన్ షాపులను బ్యాంకులకు అనుసంధానం చేయనున్నారు.  
 
 డ్వాక్రా సంఘాల పొదుపు సొమ్ము లేదా ఇతర ఏదేని బ్యాంకు లావాదేవీలను డీలర్ల ద్వారా చేయించి వారికి కమీషన్ ఇస్తామని చెబుతున్నారు. ఇప్పటికే రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న కొన్ని సరుకుల్లో కోత విధించిన ప్రభుత్వ తీరుతో కమీషన్  పడిపోయిన డీలర్లకు ఇటువంటి చర్యల ద్వారా కంటితుడుపుగా కమీషన్ పెంచడంతో పాటు  ఆర్థిక  లావాదేవీలను గ్రామ స్థాయి నుంచే పెంచుకునేందుకు యత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.   డీలర్ల సంఘ నేతలతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో  పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, సీఎం పేషీలోని పీఏ, రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహనరావు   ఈ విషయాలు చర్చించారు. గ్రామాల్లో   కరెంట్, ఫోను బిల్లులను కూడా డీలర్ల ద్వారా వసూలు  చేయాలని నిర్ణయించారు.
 
 సెల్ రీచార్జ్ కూపన్లు,  చిన్న గ్యాస్ సిలెండర్ల విక్రయాలను కూడా వీరి ద్వారా చేపట్టేలా ప్రతిపాదించారు.  ఇందుకు ఒక్కొక్క డీలరు వద్ద  14 సిలెండర్ల స్టాకు ఉండేలా పరిమితిని విధించి విక్రయాలు చేపట్టాలని నిర్ణయించారు.  దీంతో పాటు రెండు నెలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటారు. తద్వారా అనర్హులను తొలగించవచ్చన్నది   ప్రభుత్వ ఆలోచన. దీని వల్ల డీలర్లకు వచ్చే కమీషన్ తగ్గుతుందని, పలు వస్తులను విక్రయించడం ద్వారా  తగ్గిన కమీషన్‌ను డీలర్లు పొందవచ్చని చెబుతున్నారు. డీలర్లకు గుర్తింపుకార్డులను కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.  త్వరలోనే డీలర్లందరితో వర్క్‌షాపు నిర్వహించి ఈ విలేజ్ మాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు వారి పూర్తి మద్దతు పొందేందుకు  చర్యలు తీసుకుంటున్నారు.
 
 డీలర్ల తొలగింపునకు కుట్ర
  అయితే ఇన్ని రకాల సేవలు ఒకే గొడుగు కిందకు  రావాలంటే మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక విద్యార్హత ఉండి తీరాల్సిందేనని చెబుతున్నారు. అందువల్ల ఇప్పుడున్న డీలర్లలో చాలా మందిని తప్పించే ప్రయత్నం కూడా కనిపిస్తోందని కొందరు  డీలర్లు వాపోతున్నారు. డీలర్లను సస్పెండ్ చేసిన చోట స్థానిక మహిళా గ్రూపులకు ఆ  బాధ్యతలను అప్పగించాలన్న నిబంధన ఉంది. అనర్హత పేరుతో ప్రస్తుత డీలర్లను తప్పించి, మహిళా గ్రూపులకు ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.  ఇలాగయితే చాలా మంది డీలర్లు  ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.ప్రస్తుతం జిల్లాలో 1,368 రేషన్ షాపులుండగా ఇందులో 68 రేషన్ షాపులు ఖాళీగా ఉన్నాయి. మరో 65 షాపులను ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. రేషన్ షాపులకు సంబంధించి తమ నుంచి ప్రభుత్వం కోరిన  సమాచారాన్ని 15 రోజుల్లోగా పంపించాలని డీలర్ల సంఘం నేతలు తెలిపారు.   దీనిపై త్వరలో ఒక స్పష్టమయిన జీఓ విడుదల కానుందని   అంటున్నారు.  
 

Advertisement
Advertisement