లోదుస్తుల్లో దాచి పేపర్ తెచ్చేశాడు

13 Apr, 2014 02:12 IST|Sakshi
లోదుస్తుల్లో దాచి పేపర్ తెచ్చేశాడు

మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పీజీ మెట్ ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన ముఠా సభ్యుడు
 
హైదరాబాద్: ఎన్టీఆర్ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష (పీజీ మెట్-2014) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. లీకేజ్ ముఠాలో సభ్యుడొకడు కర్ణాటకలోని మణిపాల్ ప్రింటింగ్  ప్రెస్‌లో ప్రశ్నపత్రాన్ని తస్కరించి లోదుస్తుల్లో దాచి బయటకు తీసుకొచ్చాడని నిర్ధారణ అయ్యింది. సీఐడీ అదనపు డీజీ టి.క ృష్ణప్రసాద్ శనివారం మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. గతంలో కర్ణాటకలో జరిగిన ఇదే తరహా వ్యవహారాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి శిష్యుడు, సహ నిందితుడైన అమీర్ అహ్మద్ ఈ పీజీ మెట్ ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో కూడా సూత్రధారి అని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో 10 మందిని అరెస్టు చేశామన్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు 15 మంది సూత్రధారులు, దళారులతో పాటు మరో 15 మంది ర్యాంకర్లను అరెస్టు చేసినట్లయిందని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డితో పాటు ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం, హెల్త్ వర్సిటీ అధికారుల పాత్రలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

 గురువు బాటలో శిష్యుడు: అనంతపురం జిల్లాకు చెందిన రాజగోపాల్‌రెడ్డి అలియాస్ గోవింద్‌రెడ్డి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో స్థిరపడ్డాడు. విజయా బ్యాంక్‌లో పనిచేసి 2005లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. విద్యారంగంలో తనకున్న పరిచయాలతో 2007-2013 మధ్య కాలంలో పలు ప్రశ్నపత్రాలను లీక్ చేసి అరెస్టయ్యాడు. బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ (ఆర్‌జీయూహెచ్‌ఎస్-2007) ప్రశ్నపత్రం లీకేజీ, కొమెడ్ కే-2011 బోగస్ ప్రశ్నపత్రం లీకేజీ సహా కర్ణాటకలో నమోదైన నాలుగు కేసుల్లో రాజగోపాల్‌రెడ్డి ప్రధాన నిందితుడు. అతనికి డ్రైవర్‌గా పనిచేసిన దావనగెరె నివాసి అమీర్ అహ్మద్ కూడా ఆయా కేసుల్లో సహ నిందితుడు. మణిపాల్ ప్రెస్‌లో ముద్రితమైన పీజీ మెట్ ప్రశ్నపత్రం లీకేజీకి సూత్రధారి కూడా అమీర్ అహ్మదే. మణిపాల్ ప్రెస్‌కు అవసరమయ్యే సిబ్బందిని మణిపాల్‌కే చెందిన షాలిమార్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీయే ఏర్పాటు చేస్తుంటుంది.

అమీర్ తన అనుచరుడైన ప్రవీణ్‌ను ఔట్‌సోర్సింగ్ సిబ్బందిగా షాలిమార్ ద్వారా గత ఏడాది నవంబర్‌లో ప్రెస్‌లోకి పంపాడు. ప్రవీణ్ ఫిబ్రవరి 18న ఫ్రాంకింగ్ మిషన్‌లో ముద్రితమైన పీజీ మెట్ ప్రశ్నపత్రాన్ని సీసీ కెమెరాలకు చిక్కకుండా తస్కరించాడు. మిషన్ నుంచి పక్కకు పడిన ఓ పేపర్‌పై తన చేతిలోని టవల్ వేసి.. బాత్రూమ్‌కు వెళ్లే వంకతో టవల్‌తో సహా ప్రశ్నపత్రాన్ని తీసుకువెళ్లాడు. దాన్ని లోదుస్తుల్లో దాచి, తెచ్చి అమీర్‌కు అందించాడు.
 
ప్రవీణ్ ద్వారా ప్రశ్నపత్రం అందుకున్న అమీర్‌కు అది ఏ పరీక్షకు సంబంధించిందో ముందు బోధపడలేదు. ప్రశ్నల తీరుతెన్నుల్ని బట్టి వైద్య విద్యకు చెందినదై ఉంటుందని భావించి ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేయడం ద్వారా ఎన్టీఆర్ వర్సిటీదిగా గుర్తించాడు. ఆపై దళారులు, కన్సల్టెన్సీల కోసం వెతుకులాట మొదలెట్టాడు. అలా ఈ విషయం దావనగెరెకు చెందిన పౌల్సన్‌కు, అతడి ద్వారా ముంబైకి చెందిన అంజూ సింగ్, బెంగళూరు వాసి సురేష్‌బాబుకు చేరింది. వారంతా కలసి 16 మంది దళారుల సాయంతో అభ్యర్థులకు ఎరవేశారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ అవినాష్ సాయంతో ఈ ప్రశ్నపత్రానికి ‘కీ’ తయారు చేయించారు. గోవా, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ల్లోని ఇళ్లు, రిసార్ట్‌లు, అపార్ట్‌మెంట్స్‌లో అభ్యర్థులకు ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేశారు. గతంలో రాజగోపాల్‌రెడ్డి బోగస్ ప్రశ్నపత్రాన్ని రూ. 11 లక్షల చొప్పున విక్రయించగా, ఇప్పుడు అమీర్ గ్యాంగ్ మాత్రం ఈ ప్రశ్నపత్రాన్ని రూ. 1.5 కోట్లకు బేరం పెట్టింది. సీఐడీ దర్యాప్తులో ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. దీంతో శుక్రవారం కర్ణాటకలో అమీర్ అహ్మద్, ప్రవీణ్, అంజూసింగ్, సురేష్‌బాబు, అవినాష్‌లను సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. అలాగే ఆకుల శ్రీకాంత్ (మొదటి ర్యాంకర్), సోనియా ఆరోగ్య ప్రకాశ్ (23వ ర్యాంకర్), వీఎన్ గౌతమ్ వర్మ (29వ ర్యాంకర్), పి.వినీల (95వ ర్యాంకర్), రెండో ర్యాంకర్ సాయిసుధ తరఫున నగదు చెల్లించిన ఆమె భర్త డాక్టర్ ఫణీంద్రలను అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్‌ఫోన్లు, చెక్‌లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
 
నిందితులకు వైద్య పరీక్షలు..

 పీజీమెట్ లీకేజీ స్కాంలో అరెస్టైన ఐదుగురికి శనివారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబర్‌పేట్‌కు చెందిన ఆకుల శ్రీకాంత్, చిత్తూరు జిల్లా ఎంఎన్‌ఎస్ కాలనీకి చెందిన పులి వినీల, రంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌కు చెందిన బి.ఎస్.ఆరోగ్య ప్రకాశ్, వైజాగ్‌కు చెందిన కె.వి.ఎన్.గౌతమ్‌వర్మ, కరీంనగర్ సాయిరామ్ ఆస్పత్రి కన్సల్టెంట్ సర్జన్ మండలి ఫణీంద్రలను వైద్య పరీక్షల అనంతరం సీఐడీ పోలీసులకు వారిని అప్పగించారు.
 
 ఇంకేమైనా లీక్ అయ్యాయా?

 దేశవ్యాప్తంగా పలు పోటీపరీక్షల ప్రశ్నపత్రాలు మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రితమవుతున్నాయి. పీజీ మెట్ ప్రశ్నపత్రంలాగే మరేవైనా లీక్ అయ్యాయా? అనే కోణంలోనూ సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం కోర్టు అనుమతితో నిందితుల్ని తమ కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించారు.
 

మరిన్ని వార్తలు