‘ప్యాసింజర్’కు కోపమొచ్చింది

4 Sep, 2014 00:39 IST|Sakshi
  •      ‘కాకినాడ’ రైలు ఆలస్యంపై ఆగ్రహం
  •      రెండు గంటలకుపైగా రైళ్ల నిలిపివేత
  •      గోపాలపట్నం ఆర్‌ఆర్‌ఐ పాత కేబిన్‌వద్ద ఆందోళన
  • విశాఖపట్నం : రైలు ప్రయాణికులు ఆగ్రహించారు. ప్యాసింజర్ రైలంటే అంత లోకువా? టికెట్ తక్కువయినంత మాత్రాన గంటల తరబడి బండిని కదలనీయరా..అంటూ ఆగ్రహించి పట్టాల మీద బైఠాయించటంతో బుధవారం పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాకినాడ నుంచి విశాఖ వచ్చే ప్యాసింజర్ ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గంటలో గమ్యానికి చేరాల్సిన రైలు రెండు గంటల తర్వాతే చేరుతుండడంపై నిరసన వెల్లువెత్తింది. చివరకు రైల్వే పోలీసుల హెచ్చరికలతో రైళ్లు బలవంతంగా కదిలాయి. వివరాలిలా ఉన్నాయి.

    కాకినాడ నుంచి విశాఖకు రోజూ ప్యాసింజరు రైలు నడుస్తోంది. ఇది అనకాపల్లి వరకూ బాగానే వస్తున్నా తర్వాత నత్తనడకే. గోపాలపట్నం ఆర్‌ఆర్‌ఐ పాత కేబిన్ వద్ద గంట వరకూ నిలిచి పోతోంది. ఇలా బుధవారం కూడా జరగడంతో రైల్లో ఉన్న ప్రయాణికులు వేడెక్కిపోయారు.  విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులూ, ఇతర ప్రయాణికులు రైలు దిగి పట్టాలపై బైఠాయించారు.

    తమ కళ్ల ముందే రైళ్లన్నీ వెళ్లి పోతున్నా ఇక్కడి రైలు మాత్రం రోజూ ఆలస్యంగానే నడుస్తోందని మండిపడ్డారు. నిరసన విరమించాలని రైల్వేభద్రతాధికారులు కోరినా ప్రయాణికుల్లో వేడి చల్లారలేదు. డీఆర్‌ఎం వచ్చి దీనికి  సమాధానం వచ్చి చెబితే కానీ ఇక్కడి నుంచి కదిలేదని లేదని హెచ్చరించారు. దాదాపు రెండు గంటలకుపైగా వాగ్వాదాలు జరిగాయి. ఈ కారణంగా వెనుక వెళ్లవలసి ఉన్న చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఎదురుగా వెళ్లాల్సిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా నిలిచిపోయింది.

    రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికుల ఆగ్రహావేశాలు పెరగడం, పరిస్థితి తీవ్రంగా మారడంతో భద్రతాధికారులు అడుగు ముందుకేసి రైలు కూత శబ్దన్ని పెద్దగా వినిపించారు. ప్రయాణికులను చెదరగొట్టి బలవంతంగా రైలును కదిలించారు. దీంతో రైలు గం. 11.40 సమయంలో వెళ్లింది. దీంతో పాటు నిలిచిపోయిన రైళ్లన్నీ కదిలాయి. ఇక్కడ రైళ్లు హటాత్తుగా నిలిచి పోవడంతో పలువురు ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
     

మరిన్ని వార్తలు