పండగ పూట.. పట్నంబాట

13 Jan, 2014 04:21 IST|Sakshi

ఆదోని పరిసరప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు మూటముళ్లె సర్దుకొని పిల్లాపాపలను సంకనెత్తుకొని బతుకుదెరువుకు సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. శని, ఆదివారాలు రెండురోజుల పాటు వలస వెళ్లేవారితో ఆదోని ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దకడుబూరు మండలాల పరిధిలోని గుడికంబాలి, మల్లన్నహట్టి, మరలి, వల్లూరు, ఎరిగేరి, పీకలబెట్ట, చిన్నతుంబళం, కందుకూరు తదితర ప్రాంతాల నుంచి దాదాపు వేయి కుటుంబాలు బెంగుళూరుకు వలస వెళ్లాయి.

ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల దిగుబడులు అరకొరగా చేతికి అందాయని, ఏడాది పొడవునా కుటుంబ పోషణ భారం అవుతుందనే వలస వెళ్తున్నట్లు ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు తిక్కన్న, బుజ్జమ్మ, లక్ష్మి, రామలక్ష్మి, మల్లన్న, ఉలిగయ్య, మారయ్య, వీరారెడ్డి, లక్ష్మన్న, సుంకన్న, కె.లక్ష్మీ ఆవేదన చెందారు. ప్రస్తుతం గ్రామాల్లో పనులు లేకపోవడం ఉన్న పనులు గ్రామంలోని కూలీలకు సరిపడకపోవడంతో వలస వెళ్తున్నట్లు కూలీలు చెప్పారు.వ్యవసాయ కూలీలు, చిన్న,సన్నకారు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు