మత ప్రాతిపదికన ఉగ్ర సమీక్షలా? | Sakshi
Sakshi News home page

మత ప్రాతిపదికన ఉగ్ర సమీక్షలా?

Published Mon, Jan 13 2014 5:00 AM

మత ప్రాతిపదికన ఉగ్ర సమీక్షలా? - Sakshi


 హోంమంత్రి షిండేపై నరేంద్ర మోడీ ధ్వజం
 ఉగ్రవాదులకు మతం ఉంటుందా?
 కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలంటూ మండిపాటు
 
 పణజీ (గోవా) నుంచి సాక్షి ప్రతినిధి: మైనారిటీలపై నమోదైన ఉగ్రవాద కేసులను సమీక్షించాలంటూ అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే కోరడంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. యూపీఏ ప్రభుత్వం బరితెగించి మత రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఉగ్రవాదులకు మతం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఆదివారం గోవా రాజధాని పణజీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ... కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘నేరాలకు పాల్పడే వారిని అరెస్టు చేసేటప్పుడు వారిలో ముస్లింలు ఉండకుండా చూడాలని షిండే అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాశారు. ఇదేం విధానం? నేరానికి పాల్పడే వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అని అతని మతం నిర్దేశించాలా? కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది’ అని తూర్పారబట్టారు. ఈ అంశంపై షిండే అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయడాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా తనకేమీ తెలియదనడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. కేసుల ఉపసంహరణ అధికారం కేవలం జడ్జీలకే ఉంటుందని...ఈ విషయంలో షిండేను ఎవరో తప్పుదోవ పట్టించి ఉంటారన్నారు.
 
 అధికారమిస్తే సమాఖ్య వ్యవస్థ బలోపేతం
 కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దేశానికి భారంగా మారాయని, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండింటి నుంచి దేశానికి విముక్తి కల్పించాలని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో దేశం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తప్పులను సరిదిద్దడంతోపాటు సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేస్తామని, రాజ్యంగ సంస్థల ప్రతిష్టలను ఇనుమడింప చేస్తామని, దేశ ప్రజలకు జవాబుదారిగా ఉంటామని హామీ ఇచ్చారు.
 
 జయంతి ట్యాక్స్ గురించి ఇప్పుడే వింటున్నా...
 వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరు కోసం లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఆ శాఖ పదవికి రాజీనామా చేసిన జయంతీ నటరాజన్‌పై మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్‌కం ట్యాక్స్, సేల్స్‌ట్యాక్స్ గురించి తనకు తెలుసుగానీ ‘జయంతి ట్యాక్స్’ అంటే ఏమిటో ఈమధ్యే తెలిసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయన్నారు. కాగా, మోడీ ఆరోపణలను జయంతి తోసిపుచ్చారు.
 
 మీడియాకు చురకలు
 దేశంలో వార్తాచానళ్లు, పత్రికలకు ఢిల్లీ రాజకీయాలు తప్ప ఏమీ కనిపించడంలేదని పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అధిక ప్రచారం కల్పించడాన్ని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. నిరాడంబరతకు మారుపేరైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఒకవేళ ఢిల్లీలో ఉండి ఉంటే దేశానికి ఆయన గురించి తెలిసి ఉండేదన్నారు. మీడియా కొన్నేళ్లపాటు తనను దూరం పెట్టినా ప్రజల మనసును గెలుచుకోగలిగానని చెప్పుకొచ్చారు. ‘టీవీలో కనిపించే వ్యక్తి కావాలో లేక వారిని ముందుకు నడిపించే వ్యక్తి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని అన్నారు.
 
 గోవాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి: పారికర్
 గోవా సీఎం పారికర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్రం మూసేసిన మైనింగ్‌ను పునఃప్రారంభించాలని మోడీని కోరారు. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో 270 స్థానాలు సాధిస్తామని...గోవాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలను కోరారు.

Advertisement
Advertisement