జిల్లా ప్రజలపై రోజుకు 6.46 లక్షల పెట్రోభారం

1 Aug, 2013 03:24 IST|Sakshi

నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: వాహనాల యజమానులపై యూపీఏ ప్రభుత్వం మరోమారు పెట్రోభారం మోపింది. డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అన్ని రకాల పన్నులతో కలిపి పెట్రోల్‌పై లీటరుకు 95 పైసలు, డీజల్ 62 పైసలు పెరిగింది. జిల్లా వ్యాప్తంగా రోజూ 7.50 లక్షల లీటర్ల డీజిల్, 1.80 లక్షల లీటర్ల పెట్రోలు విక్రయం జరగనుంది. ఈ క్రమంలో పెరిగిన ధరలతో పెట్రోల్‌పై రోజుకు రూ. 1.71 లక్షలు, డీజిల్‌పై రూ.4.65 లక్షలకు పైగా జిల్లా ప్రజలపై భారం పడనుంది.
 
 మొత్తం మీద నెలకు రూ.1.91 కోట్లు మేర భారం మోయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చిందని పెట్రో ఉత్పత్తుల కంపెనీలు చెబుతున్నాయి. మూడు నెలల వ్యవధిలోనే పెట్రోల్ ధర 5 సార్లు, డీజిల్ ధర 4 సార్లు ధరలు పెంచడంపై వాహన యాజమానులు మండి పడుతున్నారు.
 

మరిన్ని వార్తలు